అన్నదాతకు ఒరిగేది శూన్యమే
సాక్షి, చైన్నె: వ్యవసాయ బడ్జెట్‌తో నిజమైన అన్నతదాతకు ఒరిగేది శూన్యమేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆరోపించారు. వ్యవసాయ బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు వ్యవసాయ బడ్జెట్‌లో రైతులకు మేలు చేసే ఒక్క పథకం అంటూ లేదని ధ్వజమెత్తారు. మండు టెండలో అన్నదాత పడుతున్న శ్రమకు గుర్తింపు లేదని, వర్షాల సీజన్‌లో నెలకొనే నష్టాలకు ఆదుకునే వారు లేరని, ప్రభుత్వ ప్రకటనలన్నీ కంటి తుడుపు చర్యఅని ఆరోపించారు. తమిళనాడులో 11.75 లక్షల హెక్టార్ల అదనపు విస్తీర్ణంలో అంటూ గతంలో పేర్కొన్నారని, అయితే,సాగు విస్తీర్ణం అన్నది క్రమంగా తగ్గుతోందని వివరించారు. అయితే ఈ పాలకులు సాగు విస్తీర్ణం పెంపు అంటూ నాటకాలు రచిస్తున్నారని విమరిశంచారు. భౌగోళిక గుర్తింపు ప్రయత్నాలు అని పేర్కొంటున్నారేగానీ, వాటిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. గతంలో ప్రకటించిన వాటికి భౌగోళిక గుర్తింపు సాధనలో ఎందుకు విఫలమైనట్టు అని ప్రశ్నించారు. ఏటా వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలకు శాశ్వత మోక్షం కల్పించే పథకం, ప్రాజెక్టు అన్నది లేక పోవడం విచారకరంగా పేర్కొనారు. ఈ బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలన్నీ కాగితాలకే పరిమితం కానున్నాయే గానీ, ఆచరణలో పెట్టబోరని,ఎన్నికల దృష్ట్యా, రైతల దృష్టి తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం మాత్రమే ఈ బడ్జెట్ అని పాలకులపై విమర్శలు గుప్పించారు. గతంలో తాము రైతు కమిటీల ద్వారా నేరుగా అన్నదాత వద్దకే పథకాలు వెళ్లే విధంగాచర్యలు తీసుకుంటే, ఈ పాలకులు వాటిని నిర్వీర్యంచేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో ఆవిష్కరణల కోసం డాక్టర్ ఎంఎస్ స్వామి నాథన్ రీసెర్చ్ ఫండ్ సృష్టించ బడుతుందని ప్రకటించి, కేవలం రూ. కోటి కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులను మోసం చేయడంలో డీఎంకే పాలకులు నిష్ణాతులు అని,మరో మారు అదే బాణి అనుసరించారని విమర్శించారు. డీఎంకే పాలనలో తమిళనాడు ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, తమిళనాడు ప్రభుత్వం అప్పులు చేయకుండా ప్రాజెక్టులు అమలు చేసే పరిస్థితిలో లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment