ప్రభుత్వాస్పత్రి ముట్టడి
వేలూరు: వేలూరు సమీపంలోని అడుక్కంబరైలో ప్రధాన ప్రభుత్వాస్పత్రి, మెడికల్ కళాశాల నడుస్తోంది. ఇక్కడ రోజూ వేల సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తుంటారు. దీంతో ఆస్పత్రి నుంచి వేల లీటర్ల డ్రైనేజీ నీరు ప్రతి రోజూ బయటకు వెళ్లి ఈ నీరు పూర్తిగా డ్రైనేజీ కాలువ ద్వారా సప్తవిపురం చెరువులో కలుస్తుంది. అయితే గ్రామస్తులు ఆస్పత్రి నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని చెరువులో కలపరాదని పలు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ఆందోళనలు చేసినప్పటికీ వాటిని పరిష్కరించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఒక్కసారిగా బుధవారం ఉదయం ప్రభుత్వాస్పత్రి ముఖ ద్వారా వద్దకు చేరుకొని ముందుగా ధర్నా నిర్వహించి అనంతరం రాస్తారోకో చేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకొని గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో డ్రైనేజీ నీరు చెరువులో కలపడం వల్ల తాము తాగే నీరు కలుషితంగా వస్తున్నాయని వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు రాస్తారోకోను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment