
ధ్వజారోహణంతో పంగుణి ఉత్సవాలు ప్రారంభం
తిరుత్తణి: తిరువలంగాడులోని వడారన్నేశ్వరర్ ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తిరువలంగాడులోని వడారన్నేశ్వరర్ ఆలయంలో ప్రతి ఏటా పంగుణి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టే విధంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలంకరించారు. ఉదయం 8 గంటలకు ఆలయ ధ్వజస్తంభానికి శివాచార్యులు పూజలు చేసి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. పది రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలో భాగంగా ప్రతిరోజూ ఉత్సవర్లు సోమస్కందర్ వాహనాల్లో కొలువై ఆలయ మాడ వీధుల్లో ఊరేగనున్నారు.
తిరుత్తణి ఆలయంలో భక్తుల సందడి
పంగుణి కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తజన సందడి నెలకొంది. మాడ వీధుల్లో సర్వదర్శన క్యూలో భక్తులు మూడు గంటల పాటు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. కృత్తిక సందర్భంగా 50 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.