
ఉక్కుపాదం మోపండి!
అసెంబ్లీ నివాళి
ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే, స్పీకర్ అప్పావు దృష్టికి కశ్మీర్ ఉగ్రదాడుల గురించి సీఎం స్టాలిన్ ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, అమాయకులపై పర్యాటకులపై జరిగిన ఈ దాడి అమానవీయ చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు మరణించారని, తమిళులు సైతం గాయపడ్డ బాఽధితులలో ఉన్నట్టుగా సమాచారం వచ్చిందన్నారు. అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులను గురి పెట్టి నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా దాడి చేసిన ఉగ్రవాదులను వదిలి పెట్టకూడదన్నారు. ఇటీవలి కాలంలో పౌరులపై జరిగిన అతి పెద్ద దాడి ఇది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ప్రస్తావించారని గుర్తు చేశారు. ఉగ్రవాద సంస్థ తామే దాడి చేసినట్టు చెప్పుకోవడం బట్టి చూస్తే అక్కడ ఎంత భయంకరమైన, క్రూరమైన, వాతావరణం ఉందో స్పష్టమవుతోందన్నారు. ఈసందర్భంగా అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా జరిగిన దాడి,పుల్వామా దాడి తదితర ఉగ్ర వాద చర్యలను గుర్తు చేస్తూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద – తీవ్రవాద సంస్థలను ఉక్కు పాదంతో నలిపి పారేయాలని, కూకటి వేళ్లతో సహా పెకలించాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకు తీసుకునే చర్యలకు తమిళనాడు, తమిళనాడు ప్రజలు మద్దతుగా ఉంటారని వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని తీవ్ర కలవరంలో పడేసిన ఈ దారుణ ఘటనలో బాధితులైన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్రం చర్యలు విస్తృతం చేయాలని కోరారు. చివరగా సభలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈరోడ్ కోట ఈశ్వరన్ ఆలయం, పెరుమాళ్ ఆలయాల వద్ద పోలీసు భద్రత, ఈరోడ్‌లోని మసీదుల వద్ద , విమానాశ్రయంలో పహారా, పర్యాటక ప్రదేశాల్లో వాహనాల తనిఖీ
ఉగ్రవాద మూకలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. వారిని అణిచి వేయడానికి తీసుకునే ఎలాంటి చర్యలకై నా మద్దతుగా తమిళనాడు ప్రభుత్వం, తమిళ ప్రజలు ఉంటారని వ్యాఖ్యానించారు. కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో హతమైన పర్యాటకులకు తమిళనాడు అసెంబ్లీలో బుధవారం నివాళులర్పించారు. వారి కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు.
సాక్షి, చైన్నె: జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులపై పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు పంజా విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమిళులు సైతం చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సీఎం స్టాలిన్ అప్రమత్తమయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు, ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేయించారు. కశ్మీర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కోసం ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి విజయన్‌తో పాటూ పుదుక్కోట్టై జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి అఫ్తాబ్ రసూల్‌ను రంగంలోకి దించారు. తమిళులు మరణించినట్టుగా తొలుత సమాచారాలు వెలువడ్డా, చివరికి ఇద్దరే గాయపడ్డట్టు తేలింది. వీరు చైన్నెకు చెందిన డాక్టర్ పరమేశ్వరన్, మరొకరు చంద్రుగా గుర్తించారు. అలాగే పహల్గాంలో 28 మంది బస చేసి ఉన్నట్టుగా గుర్తించారు. వీరిని అక్కడి నుంచి ఢిల్లీకి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. మదురై పరిసరాలకు చెందిన 68 మంది పర్యాటకులు పహల్గాం చేరువలో ఉన్నట్టుగా గుర్తించి, వారిని అక్కడి రాకుండా వెనక్కి పంపించారు. వీరందర్నీ సురక్షితంగా తమిళనాడుకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఈ దాడుల గురించి కశ్మీర్ పర్యటనలో ఉన్న తమిళనాడుకు చెందిన వారు తమ ఆందోళనను కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ ద్వారా తెలియజేశారు. తామంతా సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చైన్నె నుంచి కుటుంబంతో వెళ్లిన జయశ్రీ మాట్లాడుతూ, తన కుటుంబంతో కారులో బైసారన్‌కు బయలుదేరినట్టుగా వివరించారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా తాము అక్కడికి చేరుకున్నామని, లేకుంటే తాము ఈ దాడిలో బలై ఉండే వాళ్లమని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి విజయ్ పేర్కొంటూ, తమకు అందిన సమాచారం ఆధారంగా తొలుత 28 మంది తమిళనాడు వాసులను గుర్తించామన్నారు. వీరందర్నీ సురక్షితంగా పహల్గాం నుంచి ఢిల్లీకి రైలు ద్వారా పంపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మరో 68 మంది ఉన్నట్టు సమాచారం వచ్చిందని, వీరంతా సురక్షితంగానే ఉన్నారన్నారు. మరెవ్వరైనా ఉన్నారా..? అని ఆరా తీస్తున్నామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందుతున్నట్టు పేర్కొన్నారు.
ఉగ్రమూకల కట్టడి చర్యలకు పూర్తి మద్దతు
అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ ప్రకటన
కశ్మీర్ పహల్గాం మృతులకు సభలో నివాళి
ఇద్దరు తమిళులకు గాయాలు
90 మంది సురక్షితమని వెల్లడి
రాష్ట్రంలో భద్రత కట్టుదిట్టం
కశ్మీర్‌లో ఉగ్ర పంజా నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని విమానాశ్రయాలలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీ, పరిశీలన అనంతరం అనుమతిస్తున్నారు. చైన్నె, కన్యాకుమారి, రామేశ్వరం, మదురైలకు ఉత్తరాది నుంచి వచ్చే రైళ్ల మీద నిఘా పెట్టారు. అన్ని రైల్వే స్టేషన్లలో నిఘా పెంచారు. ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతున్న తిరుచెందూరు తదితర అన్ని ప్రధాన ఆలయాలతో పాటూ పర్యాటకులతో కిటకిట లాడుతున్న ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడు, కన్యాకుమారిలో భద్రతను మూడింతలు పెంచారు. అనుమానితులను విచారిస్తున్నారు. హోటళ్లు, లాడ్జీలపై నిఘా వేసి తనిఖీలు చేస్తున్నారు.

ఉక్కుపాదం మోపండి!

ఉక్కుపాదం మోపండి!

ఉక్కుపాదం మోపండి!

ఉక్కుపాదం మోపండి!

ఉక్కుపాదం మోపండి!