నవశక్తికి గోల్డ్ మెడల్
తిరుపతి సిటీ: అఖిల భారత స్థాయి కరాటే పోటీల్లో తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి బంగారు పతకం సాధించి శభాష్ అనిపించుకుంది. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని చాముండి విహార్ స్టేడియంలో 29వ అఖిల భారత షిటోర్యు కరాటే చాంపియన్‌షిప్–2025 పోటీలు నిర్వహించారు. రెండ్రోజుల ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన జట్లలో తిరుపతిలోని వెంకీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి నవశక్తి ప్రాతినిధ్యం వహించి, ఓపెన్ సీనియర్ మహిళల కుమితే (ఫైటింగ్) విభాగంలో పాల్గొంది. రెండేళ్ల విరామం అనంతరం పాల్గొన్నప్పటికీ సెమీస్‌లో కేరళ, ఫైనల్స్‌లో కర్ణాటక క్రీడాకారిణులను ఓడించింది. ఇప్పటికే కరాటే పోటీల్లో లెక్కలేనని పతకాలు, ట్రోఫీలు, అవార్డులు సాధించిన నవశక్తి మూడున్నరేళ్ల ప్రాయంలోనే కృష్ణానదిలో 4.5 కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చెక్కు చెదరని రికార్డు కలిగి ఉంది. బీటెక్ పూర్తి చేసిన నవశక్తి ప్రస్తుతం చైన్నెలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోంది.


