నేటి నుంచి ఓటరు జాబితా పరిశీలన
– ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్న
అధికారులు
తిరువళ్లూరు: ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాను సరి చూసే కార్యక్రమాన్ని నేటి నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. ఓటరు జాబితాను సరి చూడడం, కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడం, మార్పులు చేసి ఫిబ్రవరిలో సవరించిన తుది ఓటర్లు జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలోని పేర్లను ఇంటింటికి వెళ్లి సరి చూసే కార్యక్రమాన్ని నిర్వహించనున్న క్రమంలో సోమ వారం మధ్యాహ్నం కలెక్టర్ ప్రతాప్ తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అత్యధికంగా మాధవరంలో నాలుగు లక్షల ఓటర్లు, అత్యల్పంగా పొన్నేరిలో 2.71 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. మొత్తం 35.82 లక్షల ఓటర్లు ఉన్నట్టు వివరించారు. ఓటర్లు జాబితాలలోని పేర్లును ఇంటింటికి వెళ్లి సరి చూసే కార్యక్రమాన్ని నేటి నుంచి నిర్వహించనున్నట్టు తెలిపారు. నెల రోజులపాటు జరిగే ప్రక్రియలో ప్రజల కు అధికారులకు సహకరించాలని సూచించారు. ఓటర్లు జాబితాలో తనిఖీల కోసం 3699 పోలింగ్ బూత్‌లలో 391 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్టు వివరించారు.
పైలట్ ప్రాజెక్టుగా ఆర్కేపేటలో ప్రారంభం
16వ జనాభా లెక్కల సేకరణ పనులు 2027లో ప్రారంభం కానున్న క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా ఆర్కేపేట, కాంచీపురం జిల్లాలోని మాంగాడు, క్రిష్టగిరి జిల్లాలోని అంజెట్టి యూనియన్‌లో జనాభా లెక్కల సేకరణ పనులను ప్రారంభించినట్టు కలెక్టర్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట యూనియన్‌లోని 17 గ్రామాలలో జనాభా లెక్కల సేకరణ నవంబర్ పది నుంచి 30 వరకు సుమారు 20 రోజుల్లో ప్రక్రియ సాగుతుందన్నారు. ఇప్పటికే 98 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని వివరించారు. ఆర్కేపేట తాలూకాలోని వెళ్లత్తూరు, వంగనూరు, శ్రీకాళికాపురం, చందనవేణుగోపాలపురం, రాజానగరం, రాగనాయుడుకుప్పం, మీసాకండా పురం, జనకరాజకుప్పం, అమ్మనేరి, అమ్మయార్‌కుప్పం, ఆదివరాహపురం, సెల్లత్తూరు తదితర 17 గ్రామాల్లో అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించనున్నట్టు తెలిపారు.


