మారథాన్
అన్నా జయంతి వేడుకల్లో
తిరువళ్లూరు: అన్నా జయంతి ఉత్సవాల్లో భాగంగా తమిళనాడు క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మారథాన్ పోటీలను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్ పచ్చజెండా ఊపి, ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా జయంతి ఉత్సవాల్లో భాగంగా మారథాన్ పోటీలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలోని మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీని మంత్రి నాజర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి నాజర్ మాట్లాడుతూ యువతీయువకులకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 17 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న యువతకు 8 కిమీ, సీ్త్రలకు 5 కిమీ, 25 వయస్సు పైబడిన వారిలో సీ్త్రలకు 5 కిమీ, పురుషులకు 10 కిమీ దూరం పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. పోటీల్లో 200 మందికి పైగా పాల్గొన్నారు. పోటీల విజేతల్లో మొదటి స్థానంలో నిలిచే వారికి రూ.5 వేలు, రెండో స్థానంలో నిలిచే వారికి మూడు వేలు, మూడో స్థానంలో నిలిచే వారికి రెండు వేలు, ప్రత్యేక స్థానంలో నిలిచే వారికి రూ.వెయ్యి అందజేయనున్నారు. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్, జిల్లా స్పోర్ట్స్ అధికారి సేతురాజన్ పాల్గొన్నారు.


