సాక్షి, చెన్నె: తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఉండి ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే తాను రాజకీయాల్లోకి రాను అనే ప్రకటన తాజాఎన్నికల వరకు మాత్రమేనని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పుకొచ్చారు. రజనీకాంత్ చేసిన ప్రకటనలో ‘ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను’ అని చెప్పలేదని గుర్తుచేస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత రజనీ రాజకీయ ఎంట్రీ ఉంటుందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ మొదలైంది. గాంధీయ మక్కల్ ఇయ్యకమ్ (జీఎంఐ) అధినేత, రజనీకాంత్ సన్నిహితుడు తమిళరువి మణియన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
‘‘రజనీ ఇక రాజకీయాల్లోకి రాను అనే ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రాలేనని చెప్పుకొచ్చారు. అందుకే రజనీ మక్కల్ మండ్రమ్ (ఆర్‌ఎంఎం)ను ఇంకా రద్దు చేయలేదు. ఒకవేళ భవిష్యత్‌లో రజనీ రాజకీయాల్లోకి వస్తానంటే గాంధీయ మక్కల్ ఇయ్యకమ్ సహాయం చేస్తుంది. లేకపోతే స్వచ్ఛంద సంస్థగా కొనసాగుతుంది’’ అని మణియన్ తెలిపారు. రెండు నెలల కిందట తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి రజనీకాంత్ సంచలన చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్యం బారిన పడడంతో యూటర్న్ తీసుకుని ‘రాజకీయాల్లోకి రాను’.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేస్తా’ అని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రేక్షకాభిమానులు, ప్రజలు రజనీ రాజకీయాల్లోకి రావాలనే విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. దీనిపై కూడా ఇటీవల రజనీ ‘తనను ఇబ్బంది పెట్టవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇది ఇలా ఉంటే రజనీ మాత్రం రాజకీయాల్లోకి రావాలనే పెద్ద ఎత్తున ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment