సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల బలిదానాలు బాగా కలిచి వేశాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అమరుల ప్రాణ త్యాగాలకు వెలకట్టలేమని.. 600 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం సభావేదికపైకి చేరుకొని తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతోపాటు పలువురి అమరుల కుటుంబాలను సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటంలో హింస జరగకుండా తమ శక్తిమేర చూశామని చెప్పారు. తనపై జరిగిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపై జరిగి ఉండదని.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని చెప్పుకొచ్చారు.
చదవండి: అమరుల స్మారక చిహ్నం ప్రారంభం, ప్రత్యేకతలివే
‘నిరసనలతో ఢిల్లీ సర్కార్ దిగి వచ్చింది. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించాం. ఉద్యమంతోనే ఢిల్లీ నుంచి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన వచ్చింది. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టే విధంగా దిగజారారు. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలున్నాయి. ఆ తరువాత 8 ఏళ్లకే ఇబ్బందులు మొదలయ్యాయి. టీఎన్‌జీవోలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తొలి, మలి ఉద్యమాల్లో విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. పోరాటంలో ఎప్పుడూ జయశంకర్ వెనకడగు వేయలే. ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాం. అమరజ్యోతి ఎల్లకాలం ఉండేలా నిర్మించుకున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. అందరి అంచనాలు తలకిందులు చేశాం. పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా ట్యాంక్‌బండ్ తయారైంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment