Distribution of fish medicine to asthmatics returns after 3 years - Sakshi
Sakshi News home page

చేప ప్రసాదం: 80 వేల మందికి పైనే..

Published Sat, Jun 10 2023 2:34 AM | Last Updated on Sat, Jun 10 2023 2:42 PM

Distribution of fish medicine to asthmatics starts - Sakshi

అబిడ్స్‌/గన్‌ఫౌండ్రీ: ఆస్తమా రోగులు ఎంతగానో ఎదురుచూసే చేప ప్రసాదం పంపిణీ శుక్రవారం నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు 80 వేల మందికి చేప ప్రసాదం ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటల వరకు పంపిణీ ఉంటుందన్నారు. కాగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మొదట బత్తిని కుటుంబ సభ్యుల చేపప్రసాదం పంపిణీని శుక్రవారం ఉదయం 8 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వయంగా చేప ప్రసాదం వేసి ప్రారంభించారు.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఆస్తమా రోగులు, సామాన్య ప్రజలు కూడా వేలాదిమంది తరలివచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పోలీస్, మత్స్యశాఖ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆర్‌ఆండ్‌బీ, వాటర్‌బోర్డు, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు పలు శాఖల ఉన్నతాధికారులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకు ముందు దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలోనూ మొదట చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.   

మంత్రి స్వయం పర్యవేక్షణ 
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపప్రసాదం పంపిణీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వయంగా శుక్రవారం రోజంతా పర్యవేక్షించారు. ఉదయం ప్రారంభించిన మంత్రి రాత్రి వరకు పలుమార్లు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. వాటర్‌బోర్డు, బద్రి విశాల్‌ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, మజ్జిగ పంపిణీ చేశారు.

ఇక నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, సెంట్రల్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, నగర కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తదితరులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం రాత్రి వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో దాదాపు 90 వేల చేప పిల్లలను విక్రయించినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాథోడ్‌ తెలిపారు. శనివారం ఉదయం వరకు ప్రజలకు అవసరమైనన్ని చేపపిల్లలను అందుబాటులో ఉంచామన్నారు. రాత్రంతా చేపమందు ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని, చేపపిల్లల విక్రయం కూడా కొనసాగుతుందన్నారు.  

32 కేంద్రాల ద్వారా పంపిణీ 
చేప ప్రసాదాన్ని 32 కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు. బత్తిని కుటుంబానికి చెందిన 250 మంది కుటుంబ సభ్యులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థల నాయకులు వాలంటీర్లుగా సేవలందించారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్వినిమార్గం, మాజీ కార్యదర్శి వినయ్‌కుమార్‌ ముదిరాజ్‌తో పాటు పలువురు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రతినిధులు చేపప్రసాదం పంపిణీకి చేయూతనందించారు. దాదాపు 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు. 75 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిఘా నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement