సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా సమష్టిగా కృషి చేసి పార్టీ గెలుపునకు బాటలు వేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ అధిష్టానం మార్గనిర్దేశం చేసింది. ముఖ్య నేతల మధ్య గ్రూపులు, వర్గాల తగాదాలు, పాత–కొత్త పంచాయతీలు, సమన్వయ లోపం, పదవుల పంపకాల ప్రచారం వంటివాటిని పక్కనపెట్టాలని ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఎదుగుదలకు గండికొట్టేలా ఎవరూ వ్యవహరించరాదని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని చెడగొట్టుకోవద్దని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలుచుకుని పార్టీని విజయతీరాలకు చేర్చే వ్యూహాలకు పదునుపెట్టాలని సూచించింది.
నేతలను ఢిల్లీకి పిలిపించుకుని..
రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు పెరుగుతుండటం, పార్టీ కార్యక్రమాలకు కొందరు నేతలు దూరంగా ఉంటుండటం నేపథ్యంలో వాటి ని చక్కదిద్దడంపై అధిష్టానం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను శనివారం సాయంత్రం ఢిల్లీకి రప్పించుకుంది.
తెలంగాణ రాజకీయ అంశాలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా పిలిపించింది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో ముగ్గురు నేతలు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీలో కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు నాయకులకు సంయమనం, సమన్వయం, సర్దుబాట్లు తప్పనిసరని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఇదే సమయంలో ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై చర్చించారని.. ఎన్నికల వ్యూహాలు, ప్రచార అ్రస్తాలు, నేతల పర్యటనలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. పార్టీ అవసరాలకు తగినట్టుగా, అర్హత, పనితీరు ఆధారంగా పదవులు అవే వస్తాయని భేటీ సందర్భంగా బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం.
ఆ అపోహలు తొలగేలా చూడాలి!
తమ అసంతృప్తికి గల కారణాలను ఈటల, రాజగోపాల్‌రెడ్డి అధిష్టానం పెద్దల ముందు ఉంచారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకపోవడంతో.. బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న ప్రచారం జరుగుతోందని వివరించినట్టు తెలిసింది. దీనికితోడు మంత్రి కేటీఆర్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతుండటాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మల్చుకుంటోందని చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో పథకాలు, పనుల్లో అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదేమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నట్టు తెలిసింది.
ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు నేతల వ్యవహారశైలి, సమన్వయ లేమి, తామే ఫోకస్‌లో ఉండేలా కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన జాతీయ నేతలు.. అన్ని అంశాలపై తమకు అవగాహన ఉందని, వాటిని సరిదిద్దే బాధ్యతను తమకు వదిలేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఇక రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకం అంశంపైనా చర్చ జరిగిందని, రాష్ట్ర బీజేపీలో ఏవైనా సంస్థాగత మార్పులు చేపట్టే అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని హైకమాండ్ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి.
కీలక నిర్ణయాలు తీసుకోవాలి
అధిష్టానానికి చెప్పామని ఈటల, రాజగోపాల్‌రెడ్డి వెల్లడి
తెలంగాణలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే తక్షణమే పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ జాతీయ నేతలకు స్పష్టం చేసినట్టు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘మా ఏకైక ఆశయం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే. మేం పదవుల కోసమో, లావాదేవీల కోసమో ఢిల్లీకి రాలేదు.
బీజేపీ ద్వారానే కేసీఆర్ కుటుంబ పాలనకు అంతం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా, సంకోచం లేకుండా జాతీయ నేతలకు వివరించాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని కీలక నిర్ణయాలు చేయాలని కోరాం. తక్షణ కర్తవ్యాలపై మా అభిప్రాయాలను వివరించాం’’ అని వెల్లడించారు. కేంద్ర నాయకత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అమిత్‌షా, నడ్డా హామీ ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment