సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆవరణలో సదరు భూమి ప్రభుత్వానిదని పేర్కొంటూ నోటీసు బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో అన్ని కోర్టుల్లోనూ ఇలా బోర్డులు ఏర్పాటు చేస్తారేమో అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
నోటీసు బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేలా సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం
సికింద్రాబాద్ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణలో ‘ఈ భూమి ప్రభుత్వానిది’ అంటూ రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై అందిన ఒక లేఖను హైకోర్టు సుమోటో టేకెన్ అప్ రిట్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం గురువారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీపీ మతీన్ వాదనలు వినిపించారు.
ఈ సమయంలో సీజే స్పందిస్తూ.. ‘సికింద్రాబాద్ సివిల్ కోర్టు ప్రాంగణంలో నోటీసు బోర్టు ఎవరు ఏర్పాటు చేశారు? వారు రేపు హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలి. ఇవాళ సివిల్ కోర్టులో ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో హైకోర్టు ఆవరణలో కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 6న విచారణ సందర్భంగా.. నోటీసు బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ), హైదరాబాద్ కలెక్టర్, సీపీ, మారేడుపల్లి తహసీల్దార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా వారు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment