సాక్షి, హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఆశలు రేపుతోంది. అక్కడిలానే తెలంగాణలోనూ సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్న టీపీసీసీ.. అసెంబ్లీ ఎన్నికల లక్ష్యాలను మార్చుకుంటోంది. ఇప్పటివరకు తెలంగాణలో 60–70 అసెంబ్లీ నియోజకవర్గాలను చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పుడు 100 స్థానాల దాకా సాధించగలమని అంచనా వేసుకుంటోంది.
బీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తాజా పరిణామాలతో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని.. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా, ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించుకుంటే ప్రయోజనం ఉంటోందని భావిస్తోంది. అయితే.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంపై ఆ పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ఫలితాలను చూపుతూ.. కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం పెంచుకునేందుకే వంద సీట్లు సాధించగలమని టీపీసీసీ అంచనాలు వేసుకుంటోందని పేర్కొంటున్నారు.
చేరికలతో బలోపేతమవుతాం..!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్ దృష్టిపెట్టినట్టు తెలిసింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో తెలంగాణ కాంగ్రెస్‌లోకి చేరికల కసరత్తు జరుగుతోందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులు, బీఆర్‌ఎస్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల గుర్రుగా ఉన్న నాయకులు కలిపి సుమారు 20 మంది వరకు పార్టీలోకి వస్తారనే ఆశ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితోపాటు పలువురు కీలక నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని.. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత మండలాధ్యక్షులు, బీఆర్‌ఎస్‌లోని కీలక నేతలకు గట్టిపోటీ ఇచ్చే నాయకులు కాంగ్రెస్‌లోకి రానున్నారని నేతలు అంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పార్టీ పటిష్ట స్థితికి చేరుకుంటుందని చెప్తున్నారు. తెలంగాణ జనసమితి (టీజేఎస్) కూడా కలసి వస్తుందని, అవసరమైతే కోదండరాం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. లేదంటే కాంగ్రెస్ ఉద్దేశానికి అనుగుణంగా ఆయన పనిచేస్తారనే చర్చ కూడా జరుగుతోంది.
యాత్రలు.. సభలతో..
సెప్టెంబర్ 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా ఎన్నికలకు రెండున్నర నెలల ముందే ప్రజల్లోకి వెళ్లాలని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఏఐసీసీ అగ్రనేతల పర్యటనలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. రైతు, యూత్ డిక్లరేషన్ల తరహాలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా.. మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం డిక్లరేషన్లు వెలువరించి ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
వీటితోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య పొరపొచ్చాలు లేవని, పార్టీ కోసం అందరం ఐక్యంగా పనిచేస్తామనే సంకేతాలు ఇచ్చే ప్రతిపాదన ఒకటి తెరపైకి వచ్చింది. పార్టీలోని సీనియర్ నేతలంతా కలసి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తారని.. అందులో భాగంగానే రేవంత్‌రెడ్డి రెండో విడత పాదయాత్ర వాయిదా పడిందని, భట్టి పాదయాత్ర ముగిశాక ఈ బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ రేవంత్ పాదయాత్ర నిర్వహించినా అది బస్సు యాత్ర తర్వాతే ఉంటుందని అంటున్నాయి.
కర్ణాటక ‘ఫార్ములా’ అమలు
కర్ణాటక ఎన్నికల్లో కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో అనుసరించిన వ్యూహాలను, అక్కడి నేతలను ఉపయోగించుకుని తెలంగాణలో ముందుకు వెళ్లాలని ఏఐసీసీ భావిస్తోంది.
ఇందులో భాగంగానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతోపాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సేవలను తెలంగాణలో వినియోగించుకోనుంది. కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన కేరళ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్, కర్ణాటక పీసీసీ ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీఖాన్‌లను తెలంగాణకు పంపింది.
‘నూరు’ ఊరించేలా..!
Published Sun, Jun 11 2023 3:33 AM | Last Updated on Sun, Jun 11 2023 3:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment