న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ప్రోటోకాల్ ప్రకారం మోదీ వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. అయితే మోదీ పర్యటనకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్‌తో సహా బీఆర్‌ఎస్ నేతలందరూ మోదీ నేతృత్వంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారా? మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారా? లేదా అనేది అసక్తికరంగా మారింది.
అయితే గతంలోనూ పలుమార్లు ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ఆహ్వానం అందినా కూడా సీఎం కేసీఆర్ లేదు. అన్ని సందర్భాల్లోనూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి ఆహ్వానం పలికి, వీడ్కోలు పలికేవారు. దీంతో ఈసారైనా కేసీఆర్ వస్తారా? లేక మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా? అనే చర్చ నడుస్తోంది.
కాగా జూలై 8న ప్రధాని వరంగల్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుడంతోపాటు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, రహదారుల పనులకు భూమిపూజ, కాజీపేటలో రైల్వే వ్యాగన్ల యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రాష్ట్రంలో రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
చదవండి: ఢిల్లీలోనే బండి సంజయ్.. రఘునందన్‌రావుపై చర్యలు?
ప్రధాని షెడ్యూల్ ఇదే
ఈ నెల 8 ఉదయం 9:45 కు హకీం పేట్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. 10:45 గంటలకు వరంగల్‌కు చేరుకుని రూ.5,55 0 కోట్ల వ్యయంతో చేపట్టే 176 కి.మీ జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ కింద 108 కిలోమీటర్ల మంచిర్యాల–వరంగల్ సెక్షన్ ఇందులో భాగంగా ఉంది. దీనివల్ల మంచిర్యాల–వరంగల్ మధ్య 34 కి.మీ దూరం తగ్గుతుంది. 44, 65 జాతీయ రహదారులపై వాహన రద్దీ తగ్గుతుంది.
దీంతోపాటు కరీంనగర్–వరంగల్ సెక్షన్‌లో 68 కి.మీ మేర 2 వరుసలుగా ఉన్న రహదారిని 4 వరుసలుగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేస్తారు. హైదరా బాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేటలో రూ. 500 కోట్లతో చేపట్టనున్న రైలు వ్యాగన్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment