రాజ్‌భవన్‌లో జరిగిన రాష్ట్రావతరణ వేడుకల్లో కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న గవర్నర్ తమిళి సై
సాక్షి, హైదరాబాద్: కేవలం కొంత మంది అభివృద్ధి కాకుండా, రాష్ట్రం మొత్తం జరిగితేనే అది నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. అప్పుడే తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ సార్థకత సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇక్కడివారితోపాటు అంతర్జాతీయంగా ఉన్న తెలంగాణ వాసులంతా ఉద్యమ స్ఫూర్తితో మరింత చురుకైన పాత్ర పోషించాలని.. అంతా కలసి సరికొత్త తెలంగాణకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు.
1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 30 మందిని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారందరినీ గవర్నర్ తమిళిసై శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలంటూ.. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్, ప్రసంగం ఆ సాంతం తెలుగులోనే కొనసాగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ అన్నది కేవలం ఒక నినాదం కాదు. ఆత్మగౌరవ నినాదం. నా జీవితంలో ప్రతి క్షణం ప్రజాసేవకే అంకితం. నేను తెలంగాణ ప్రజలతో ఉన్నాను.
తెలంగాణ ప్రజలు నాతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర కచ్చితంగా ఉంటుంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుదాం. తెలంగాణ సాధనలో 1969 ఉద్యమంలో పాల్గొన్న 30 మంది పోరాట యోధులను ఈ సందర్భంగా సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనేక రంగాల్లో ఈ పదేండ్లలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా పేరు సాధించింది. అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని మారుమూల పల్లెలకు అభివృద్ధి ఫలాలు చెందాలి’అని గవర్నర్ ఆకాంక్షించారు.
కేక్ కట్ చేసిన గవర్నర్..
శుక్రవారం గవర్నర్ పుట్టినరోజు కూడా అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె తెలంగాణ తొలి దశ ఉద్యమకారుల దగ్గరకు స్వయంగా వెళ్లి కేక్ తినిపించారు. ‘రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్‌లలో చేయాలని ప్రధాని మోదీ సూచించడం ఎంతో సంతోషించే అంశం. శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నా’అని అన్నారు.
గవర్నర్ వ్యవస్థ అలంకారప్రాయమైనదని, దాన్ని రద్దు చేయాలని ఇటీవల కేసీఆర్.. కేజ్రీవాల్, భగవంత్‌సింగ్‌మాన్‌లతో కలసి చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా..గవర్నర్ అలంకారప్రాయమన్న వ్యాఖ్యలకు ఈ రోజు రాజ్‌భవన్‌లో జరుగుతున్న వేడుకలే సమాధానమన్నారు. అవతరణ వేడుకలకు ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందా..లేదా అన్నది సమస్య కాదని, దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదన్నారు.
తానెప్పుడూ ప్రజలతోనే ఉన్నానని, వారు కూడా తనతో ఉన్నారని మరోమారు స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గవర్నర్ తమిళిసై చిన్నారులతో కలసి ఉత్సాహంగా కాసేపు కాలు కదిపారు. అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Comments
Please login to add a commentAdd a comment