సాక్షి, హైదరాబాద్: TSPSC నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూన్ 11వ తేదీన గ్రూప్-1 పరీక్ష జరుగనుంది.
అయితే, గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో పిటిషనర్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించారు. పేపర్ లీక్‌కు కారణమైన సిబ్బందితోనే పరీక్ష నిర్వహిస్తున్నారని వాదనలు వినిపించారు. అలాగే, పేపర్ లీకేజీపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఏ కమిషన్‌లో అయితే పేపర్ లీక్ అయిందో అదే కమిషన్ ఇప్పుడు గ్రూప్-1 నిర్వహిస్తోందని వాదించారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ లేదా యూపీఎస్సీతో పరీక్షలు నిర్వహించాలని, 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రూప్-1 పరీక్ష ఇదని, పారదర్శకత లేకపోతే అభ్యర్థులు నష్టపోతారని తెలిపారు. TSPSC తలపెట్టిన మిగతా పేపర్లు కూడా లీక్ అయ్యాయని, ఆ పరీక్షలను ఇంకా నిర్వహించలేదు. కానీ, వెంటనే గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తున్నారని హైకోర్టుకు వివరించారు. విచారణ పూర్తి కాకుండా పరీక్షను నిర్వహించకూడదని, దానికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
దీనిపై హైకోర్టు.. కొన్ని ప్రశ్నలు అడిగింది. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు కదా?, ఇదే సమయంలో పేపర్ లీక్‌లో అరెస్ట్ అయిన వారు ఇంకా సర్వీస్ కమిషన్ లో కొనసాగుతున్నారా అని హైకోర్ట్ ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. "కమిషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. ఈ కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్ అయ్యారు. దర్యాప్తుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ముగ్గురిని నియమించి కేసు మానిటర్ చేస్తోంది. కమిషన్‌లో కొత్త సిబ్బందిని నియమించారు. 3.8 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. 995 సెంటర్‌లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న 6 నెలలో కమిషన్ నుండి 26 పరీక్షలు నిర్వహించబోతున్నారు. పేపర్ లీక్ వ్యవహారం బయటకు రాగానే కమిషన్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షకు వారం రోజుల ముందు ఇలాంటి పిటిషన్‌లు వేయడం సరికాదు" అంటూ వాదించారు.
ఇక, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం.. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 11న జరగనున్న పరీక్షకు 3 లక్షల 80 వేల 202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే పరీక్షకు పగడ్బందిగా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రం లోకి అనుమతిస్తారు. అభ్యర్థి గుర్తింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment