స్పీకర్ గా పని చేసిన వారు ఓడిపోతారనే సాంప్రదాయానికి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా చెక్ పెట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇద్దరు తనయులలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారా అంటే ఔననే చెప్పాలి. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
జోరుగా రిటైర్మెంట్‍పై చర్చ..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరని రిటైర్మెంట్ ప్రకటిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఒకవేళ కచ్చితంగా పోటీ చేయాల్సి వస్తే జహీరాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తారని, తనయులకు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తారని చర్చ జోరుగా సాగింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ రాబోయే ఎన్నికల్లో ఆరో సారి పోటీ చేయడం ఖాయమని తాజాగా ఆయన చేసిన ప్రకటన పుకార్లకు ఫుల్ స్టాఫ్ పెట్టినట్లయింది.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలో ఈ దఫా స్పీకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయరనే ప్రచారం జోరుగా సాగింది. అందుకు అనుగుణంగా కామారెడ్డి జిల్లాలోని పాత రెండు మండలాల బాధ్యతలను ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ జిల్లాలోని పాత రెండు మండలాలను తనయుడు సురేందర్ రెడ్డికి అప్పగించారు. రెండు జిల్లాల్లో విస్తరించిన నియోజకవర్గ బాధ్యతలను వారే చూసుకునేవారు.
చదవండి:వరంగల్: చెప్పులతో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు!
ఈ నియోజక వర్గంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గిరిజన లంబాడా తండాలు కూడా బాగా ఉంటాయి. రెండు జిల్లాల పరిధిలో నియోజక వర్గం ఉంటుంది. అయితే సీనియర్ ఎమ్మెల్యే గా మంత్రిగా స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి ఎదురులేని లీడర్ గా ఎదిగారు పోచారం. సభాపతిగా హైదరాబాద్ కు పరిమితమవడం, వయస్సు మీద పడడంతో కొంత ఇబ్బంది పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరిగింది.
2018లోనే తనకు టికెట్ వద్దని కోరినప్పటికీ కేసీఆర్ వినకుండా పోచారానికే టికెట్ ఇవ్వడంతో తప్పనిసరిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం ఆ తర్వాత ఆయనకు సభాపతి బాధ్యతలను అప్పగించారు. సభాపతి కావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నా.. పోచారం ఇటీవల కాలంలో మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
సర‍్వేల్లో ఏం తేలింది?
సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేల్లో నాలుగు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్టులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే క్యాండేట్ మారితే ఓడిపోయే నియోజకవర్గాల్లో బాన్సువాడ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా పోచారంనే పోటీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనయుల భవిష్యత్తు గురించి బాధ్యత తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి పోటీకి సిద్దమయ్యారు.
సై అనక తప్పలేదా?
బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడెట్ గా ప్రకటించిన మల్యాద్రి రెడ్డికి సెటిలర్ల మద్దతు దొరికిందని తెలుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ పోచారంతోనే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారనే వాదనలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసినా వారి పోటీ వల్ల బీఆర్ఎస్ కే బలం చేకూరుతుందనే వాదనలు లేకపోలేవు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండటం పోచారం కు ప్లస్ పాయింట్.
పైగా సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరిస్తారని, నియోజకవర్గంలో పనులు కూడా చేస్తారని పోచారానికి మంచి పేరుంది. కానీ, ఈసారి కుమారులు పోటీ చేస్తే జనాల నుంచి మద్దతు పూర్తి స్థాయిలో దొరకదనే విషయం సర్వేలో తేలినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దఫా గెలిచి తరవాత వారసత్వానికి బాధ్యతలు అప్పగించే ఆలోచనతో పోటీకి సై అనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
చదవండి:కేసీఆర్ సర్కార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment