ప్రాణాలు అరచేతిలో పట్టుకొని...  | 200 Colonies In Hyderabad Are Still Under Flood Water | Sakshi
Sakshi News home page

కాలనీలు.. కన్నీళ్లు!

Published Mon, Oct 19 2020 1:40 AM | Last Updated on Mon, Oct 19 2020 5:24 AM

200 Colonies In Hyderabad Are Still Under Flood Water - Sakshi

భారీ వర్షాలకు నీటమునిగిన ఎల్బీనగర్‌లోని కోదండరాంనగర్‌ నుంచి వృద్ధులు, పిల్లలను జేసీబీ సాయంతో ఆదివారం సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న స్థానిక యువకులు

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరద ఉధృతి హైదరాబాద్‌ మహానగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆరురోజులుగా సుమారు 90 పైగా కాలనీలు నీట మునిగి నరకయాతన అనుభవిస్తుండగా... తాజాగా శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు చెరువులు తెగి మరో వందకు పైగా కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఆదివారం దాదాపు 200 కాలనీలు మునకలోనే ఉన్నాయి. ఇంకా సుమారు 230 వీధులు అంధకారంలోనే మగ్గుతుండగా, తాజాగా మరో 20 కాలనీల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. శివారు ప్రాంతాల చెరువులు సుమారు 70కు పైగా కాలనీలకు ప్రాణ సంకటంగా మారాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాల కాలనీ వాసులు సగానికి పైగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోగా, మిగతా సగం కుటుంబాలు జల దిగ్బంధానికి గురై బయటికి రాలేని పరిస్థితి నెలకొంది.

అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో పాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. తినడానికి లేక, కంటినిండా కునుకు కరువై జనం విలవిలలాడుతున్నారు. స్నానాల మాట దేవుడెరుగు కనీసం తాగడానికి మంచి నీరు కూడా కరువైంది. గూడు చెదిరి, గుండె చెరువై... సురక్షితంగా బయటపడిన వారు సైతం ఆదుకునే వారు లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మరోవైపు నాలాలు పొంగిపొర్లుతూ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు ఏరులైపారుతూ దుర్గంధంతో వీధులు కంపుకొడుతున్నాయి. శనివారం రాత్రి సరూర్‌నగర్, మేడిపల్లి, చార్మినార్‌లల్లో భారీ వర్షం నమోదైంది. గుర్రం చెరువు తెగి వరద ఉధృతికి భారీగా వాహనాలు కొట్టుకొని పోగా, ఘట్‌కేసర్‌ వెంకటాపూర్‌లోని తాళ్లకుంటకు గండి పడి వరద నీరు పంట పొలాల్లోకి చేరి తీరని నష్టాన్ని మిగిల్చింది.

ఉప్పుగూడలోని శివాజీ నగర్‌లో..  

శనివారం అర్ధరాత్రి బాబానగర్‌ గుర్రం చెరువు తెగి అల్లకల్లోలం సృష్టించింది. ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉరుకులు పరుగులు తీశారు. కొందరు ఇంటి పైకప్పుల పైకెక్కి ప్రాణాలను కాపాడుకుంటే.. మరికొందరు సురక్షితప్రాంతాలకు పరుగులు తీశారు. నీటి ఉధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు సైతం నేలమట్టమయ్యాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, పెద్ద ఎత్తున గేదెలు కూడా కొట్టుకుపోయాయి. రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చీకట్లో బిక్కుబిక్కుమని గడిపిన ప్రజలు ఉదయాన్నే బతుకుజీవుడా అంటూ రోడ్లపైకి చేరుకునే ప్రయత్నం చేశారు. వరద ధాటికి దిగువ బస్తీలలో ఇళ్లు, ప్రహ రీలు సైతం కూలాయి. గత మంగళవారం కురిసిన భారీ వర్షంతో గుర్రం చెరువు పూర్తిగా నిండి ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నబీల్‌ కాలనీ, సయీద్‌ కాలనీ, రాయల్‌ కాలనీ, మెట్రో సిటీ, వీఐపీ కాలనీ, అలీ గుల్షన్, మరియం మజీద్‌ కాలనీ, బార్కాస్‌ బస్తీలు నీట మునగగా, తాజాగా శనివారం రాత్రి చెరువు తెగడంతో దిగువ గల హఫీజ్‌బాబానగర్‌ ఎ, బి, సి బ్లాక్‌లతో పాటు నసీబ్‌నగర్, నర్కీపూల్‌ బాగ్, సాయిబాబానగర్, శివాజీనగర్, అరుంధతి కాలనీ, లలితాబాగ్‌లు జలమయమయ్యాయి.

ఉప్పుగూడలోని అరుంధతి కాలనీ..  

పెరిగిన వరద... 
నాలుగు అడుగుల లోతు నీళ్లలో ఉన్న ముంపు కాలనీల కష్టాలను శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం మరింత పెంచింది. కుదుటపడుతున్న వేళలో ముంపు కాలనీల వాసులపాలిట వర్షం పిడుగులా పడింది. అర్ధరాత్రి ముంపు కాలనీలలో ఒకేసారి నీటిమట్టం పెరిగింది. నదీమ్‌ కాలనీ, విరాసత్‌నగర్‌ కాలనీ, నీరజా కాలనీ, జమాలి కుంట తదితర ప్రాంతాల్లో సైతం రోడ్లపై ఐదారు అడుగుల మేర వరదనీరు చేరింది. పలుచోట్ల జనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఖాళీ చేసి ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్‌లలోకి మారారు. హీరానగర్‌ నాలా, బుల్కాపూర్‌ నాలాలు పొంగిపొర్లాయి. షేక్‌పేట్‌ బాలాజీనగర్, ఎంజి నగర్‌లలో కూడా వరదనీరు బీభత్సం సృష్టించింది. చంపా పేట పరిధిలోని మల్‌రెడ్డి రంగారెడ్డి, ఉదయ్‌నగర్, సూర్యానగర్‌ కాలనీలో సుమారు 40 ఇండ్లు వరదనీటి ప్రవాహంలో మునిగిపోయాయి. హరిహరపురం కాలనీలో ట్రాక్టర్ల సహాయంతో ఇళ్లలోని సామాన్లను బయటికి తీసుకొచ్చారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి. 

మృత్యువాత 
భారీవర్షాలకు కరెంట్‌ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందగా, మరోమూడు గుర్తుతెలియని మృతదేహాలు వరద నీటిలో కొట్టుకువచ్చాయి. చిలుకానగర్‌లో సెల్లార్‌లో నిండిన వరద నీటిని తోడడానికి విద్యుత్‌ మోటార్‌ను అన్‌ చేయబోయి ఇంటి యజమాని శ్రీనివాస్‌ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందగా, నసీబ్‌నగర్‌లో ఓ వ్యక్తి ఇన్‌వర్టర్‌ వద్ద షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. ఫతేనగర్‌ శోభనాకాలనీలో ఇంజనీరింగ్‌ వర్కు షాపులో ఎల్‌.వెంకటనాయుడు (31) విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. బహదూర్‌పురా, దేవిబాగ్, డబీర్‌పురా ఓవైసీ బ్రిడ్జి (నాలా)లో మూడు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. 

వణికిస్తున్న చెరువులు
మీర్‌పేటలోని పెద్ద చెరువుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో కట్టకింది భాగంలో పలుచోట్ల లీకేజీలు ఏర్పడి ప్రమాదపు అంచుల్లో ఉంది.  
బాతుల చెరువు అలుగు ఉధృతితో పలు కాలనీల్లోకి విషపూరిత పాములు చేరుతున్నాయి. 
బండ్లగూడ చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదస్థాయికి చేరుకుంది. 
నగరశివార్లలోని జల్‌పల్లి, బురాన్‌ఖాన్‌ చెరువులు నిండు కుండలా మారాయి. ఉస్మాన్‌నగర్‌లోని బురాన్‌ఖాన్‌ చెరువు కట్ట తెగితే నీరు నేరుగా నబీల్‌ కాలనీ మీదుగా గుర్రం చెరువులోకి....అక్కడి నుంచి తిరిగి పాతబస్తీని ముంచెత్తే అవకాశం ఉంది.  
కొంపల్లిలోని ఫాక్స్‌సాగర్‌ చెరువు పొంగిపొర్లడంతో సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ నీట మునిగింది.  
అంబర్‌పేట నుండి నాగోల్‌ మెట్రో వరకు రామంతాపూర్‌ ద్వారా ప్రవహించే అతిపెద్ద వరదనీటి కాలువ కట్టతెగిపోవడంతో కేసీఆర్‌నగర్‌లోని పలు బస్తీల్లో నీళ్లు చేరాయి.  
నాచారం పటేల్‌కుంట చెరువు ప్రమాదకర స్థాయికి చేరి దిగువ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement