30 ఏళ్ల క్రితం వెలసిన ఆ ఊళ్లో 13 కుటుంబాలుండేవి.. అయితే ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆ ఊరినే అమ్మేశాడు.. ఇంకో ఊళ్లో 200 మంది విద్యార్థులు.. బడికి వెళ్లాలంటే ఒకటే బస్సు.. వాళ్లు పనికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉధృతంగా పొంగుతున్న వాగును దాటాలి.. అప్పుడే వారికి బతుకుదెరువు దొరుకుతుంది.. రేషన్ మాఫియాతో అధికారులు కుమ్మక్కై పేదలకు అందాల్సిన బియ్యాన్ని మేశారు.. కరోనాతో ఛిద్రమైన ఓ కుటుంబం రోడ్డున పడగా.. వారికి శ్మశానమే ఆవాసమైంది..
►ఇలాంటి ఎన్నో వెతలు, వేదనలు, అక్రమాలను ‘సాక్షి’ అక్షరీకరించి వెలుగులోకి తెచ్చింది. వారి ఇబ్బందులకు ప్రభుత్వం స్పందించింది.. అధికారులను కదిలించింది. ప్రజలు, విద్యార్థులు పడుతున్న కష్టాలను తీర్చింది. బాధితులకు సాంత్వన చేకూర్చింది. అక్రమార్కుల ఆటకట్టించింది. ప్రభుత్వంతోపాటు పలువురు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా 2021వ సంవత్సరంలో సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చిన కథనాల్లో మచ్చుకు కొన్నింటిని చూద్దాం!
యాతన తీర్చగా
చెన్నూరుకు కోటపల్లి ప్రభుత్వ పాఠశాల 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 200 మంది విద్యార్ధులకు ఒకటే బస్.. 2021 నవంబర్ 15న ప్రచురితమైన ఈ కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆ విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు.
ఆ ఊరికి బాసటగా..
30 ఏళ్ల కిందట కామారెడ్డి–ఎల్లారెడ్డి రాష్ట్ర రహదారి పక్కన ఓ చర్చి ఫాదర్ అక్కడ పేదల వెతలనుచూసి చలించారు. పూరి గుడిసెల్లో ఉన్న వారికి ఇళ్లు కట్టించాలని భావించి 29 గుంటల భూమిని కొని తెల్ల కాగితం (సాదాబైనామా)పై రాసుకున్నారు. వారికి ఇళ్లు కూడా కట్టించారు. ఈ భూమిని ఓ ఘనుడు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని వారి ఇళ్లు కూల్చడానికి యత్నించాడు.
దీనిపై సాక్షి గత డిసెంబర్ 21న ‘ఊరినే అమ్మేశారు’ అన్న శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపారు. సాక్షి తమ కష్టాన్ని తీర్చిందని గ్రామస్తులు డిసెంబర్ 25న హైదరాబాద్‌లో సాక్షి కార్యాలయానికి వచ్చి ఎడిటర్ మురళిని కలిసి కతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తాకథనాన్ని డిగ్రీ మూడో సంవత్సరం తెలుగు పాఠ్యాంశంలో చేర్చారు.
అండగా నిలిచి..
కరోనాతో కొడుకు, కోడలు చనిపోయి ఇద్దరు మనవరాళ్లతో తల్లి పడుతున్న వేదనపై ‘కొడుకు కోడల్ని పొట్టనపెట్టుకుంది’ శీర్షికన మే 30న ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. చనిపోయిన రాజేశ్ ఇంటిపై తీసుకున్న రూ.18 లక్షల అప్పును తీర్చేందుకు చర్యలు చేపట్టారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రూ.8 లక్షలు తగ్గించారు. మిగతా రూ.10 లక్షలను దాతల ద్వారా సేకరించి బ్యాంక్ రుణాన్ని క్లియర్ చేయించి ఇంటి పత్రాలను ఆ తల్లికి అప్పగించి రుణవిముక్తి చేశారు. దీనిపై ‘గూడు చెదిరిన పక్షులకు గుండె ధైర్యం’...అప్పు తీర్చి ఇళ్లు నిలబెట్టారు అన్న కథనం సెప్టెంబర్ 1న ప్రచురితమైంది.
►ఫిబ్రవరి 15న ‘ముగ్గురు పిల్లలు, నాయినమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనంపై అప్పటి జిల్లా కలెక్టర్ శరత్ స్పందించి గంగవ్వకు రూ.50 వేల నగదు సాయం అందించారు. మనవరాలికి ఉద్యోగమిచ్చారు. సొంత ఇళ్లు కట్టించి ఇచ్చారు. దీనిపై సెప్టెంబర్ 1న ‘గూడు చెదిరిన పక్షులకు గుండె ధైర్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
అనాథల బంధువై..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గామానికి చెందిన భీమయ్య కరోనాతో చనిపోయాడు. ఆ తరువాత ఆయన భార్య గర్భంతో ఉండగానే కరోనాతో చనిపోయింది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చిన్నారుల బంధువే వీరిని సాకుతున్న వైనంపై సాక్షి 2021, మే 29న కథనాన్ని ప్రచురించగా, మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని ఆ చిన్నారులను ఆదుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం నడిమిగూడెం మధ్య కిన్నెరసాని వాగు ప్రవాహాన్ని కర్రలను ఆసరాగా చేసుకుని కూలీలు దాటుతున్న వైనంపై ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన జూలై 13న కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీసులు ఇనుప రాడ్లు, షీట్లతో తాత్కాలిక వంతెన ఏర్పాటుచేశారు.
అక్రమార్కులు పరేషాన్
జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమాల్లో ఉన్నతాధికారి లీలలు, బియ్యం అక్రమార్కులకు పెద్దల అండ.. శీర్షికన ప్రచురితమైన కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ‘సాక్షి’ కథనాలతో స్పందించిన అధికారులు రేఖ రైస్‌మిల్లు యజమానిని అరెస్టు చేశారు. అలాగే రేషన్ దందాతోపాటు ఇతర వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ హనుమంతుపై సస్పెన్షన్ వేటు పడింది.
కష్టం తీరింది..
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జడ్పీ పాఠశాలలో 298 మంది విద్యార్థులుండగా, వీరిలో 174 మంది బాలికలున్నారు. వీరందరికీ ఒకటే మూత్రశాల ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘174 మంది విద్యార్థినులకు ఒక్కటే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి భారీగా స్పందన లభించింది. పలువురు అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్పందించి ఆర్థిక సాయం ప్రకటించారు.
ఆమెకు అండగా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన గుర్రం మౌనిక కాలికి ఆపరేషన్ జరిగింది. ఏడాది కాలంగా భర్త పట్టించుకోకపోవడంతో స్టీలు రాడ్లతో ఇబ్బందితోనే యాచిస్తూ జీవనం సాగిస్తోంది. దీనిపై ‘ఏడాదిగా కాళ్లకు స్టీల్‌రాడ్లతో’ శీర్షికన జూలై 23న కథనం ప్రచురితమైంది. దీంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి సొంత ఖర్చులతో శస్త్రచికిత్స చేయించి రాడ్లు తీయించగా, 15 రోజుల తర్వాత ఇంటికి చేర్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఐసీడీఎస్ అధికారుల ద్వారా ట్రైసైకిల్ మంజూరు చేయించారు.
ఆవాసమై..
కరోనా కారణంగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ పెద్ద మరణించగా ఆ కుటుంబం మొత్తం వీధిన పడి, శ్మశానంలో నివసిస్తున్న కథనం మే 29న ప్రచురితమైంది. దీనిపై మంత్రి హరీశ్ స్పందించి ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించి, నిత్యావసర సరుకులు అందించారు.
పట్టా దక్కింది..
జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని తొమ్మిది గ్రామాలకు చెందిన రైతుల 5 వేల ఎకరాల పట్టా భూమిని అధికారులు అసైన్డ్‌గా మార్చారు. దీనిపై జూలైలో వచ్చిన కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య స్పందించారు. ఈ భూములపై కమిటీ వేసి తిరిగి పట్టా భూమిగా మార్చారు.
ఆ ఊరికి నయమైంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళపాడుకు చెందిన పలువురు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండగా.. ‘ఆ ఊరికి ఏమైంది’ శీర్షికన అక్టోబర్ 10న ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖాధికారులు గ్రామానికి చేరుకుని బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఐసీఎంఆర్, జాతీయ పోషకాహార సంస్థ బృందం కూడా పర్యటించి వివరాలు ఆరా తీసింది. పోషకాహార లోపం, దురలవాట్లే కారణమని తేల్చి, అవసరమైన ఏర్పాట్లు చేసి బాధితులకు ఉపశమనం కలిగించారు.
శుభ్రమై‘నది’
‘గోదావరి తీరం చెత్తాచెదారంతో నిండిపోయినది’ అన్న శీర్షికన ప్రచురితమైన ఫొటో ఇది. దీనిపై అధికార యంత్రాంగం వెంటనే స్పందించింది. జేసీబీతో చెత్తను తొలగించే పనులను చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment