హైదరాబాద్‌లో తగ్గిన స్థిరాస్తి క్రయవిక్రయాలు.. కారణాలివే..! | In 2022, real estate Transactions are on the decline | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తగ్గిన స్థిరాస్తి క్రయవిక్రయాలు.. కారణాలివే..!

Published Thu, Dec 22 2022 9:06 AM | Last Updated on Thu, Dec 22 2022 3:05 PM

In 2022, real estate Transactions are on the decline - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 2022లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ మహా నగర పరిధిలో గతేడాది పరుగులు తీసిన క్రయ విక్రయాలు ఈ ఏడాది మందగించాయి. ఖాళీ స్థలాల, ఫ్లాట్ల ధరలు పెరుగుదల, గృహ రుణాలపై వడ్డీ, రిజిస్ట్రేషన్‌ విలువలు పెరుగుదల, కరోనా అనంతరం మధ్య తరగతి కుటుంబాల ఆదాయం తగ్గటం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలు స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా గతేడాతో పోతే  సుమారు 20 శాతం తగ్గినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఏడాది  ఒమిక్రాన్‌వైరస్‌ దెబ్బ, తర్వాత నెలలో రిజిస్ట్రేషన్‌ ఖర్చులు పెరుగుదలతో ఆదిలోనే ఖాళీ స్థలాలు, ఇళ్ల అమ్మకాలపై దెబ్బపడింది. మరోవైపు  ప్రభుత్వం  కఠిన నిబంధనలతో వెంచర్లకు అనుమతులు తీసుకుని, ప్లాట్లు చేసి విక్రయించటం స్థిరాస్తి రంగం వ్యాపారులకు భారంగా తయారైంది. వాస్తవంగా మెరుగైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, మౌలిక సదుపాయల కల్పన ఉన్న కారణంగా  స్థిరాస్తి రంగానికి డిమాండ్‌ మాగానే ఉంటుంది.  

►మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకొని విశ్వనగరంగా రూపాంతరం చెందేందుకు హైదరాబాద్‌ నగరం సరికొత్త అవతారాలతో అన్నీచోట్లకు విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు అధికం కావడంతో పాటు ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలిరావడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్‌ ఉన్నా..తాజా పరిస్ధితులు ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. 

విలువలు పై..పైకి 
గ్రేటర్‌లో పరిధిలో చదరపు అడుగు ధర గత ఏడాదితో పోల్చితే బాగానే పెరిగింది. మొత్తం రెసిడెన్షియల్‌ మార్కెట్‌లో చదరపు అడుగు సగటు ధర రూ.3,513 పలుకుతోంది. ఇది కిందటేడాది పోలిస్తే 12శాతం ఎక్కువ.  హైదరాబాద్‌ జిల్లాలో చదరపు అడుగు సగటు ధరపై 18 శాతం,  మేడ్చల్‌–మల్కాజ్‌గిరిలో 23 శాతం, రంగారెడ్డిలో 13 శాతం, సంగారెడ్డి జిల్లాలో  42 శాతం పెరిగింది. 
►దీంతో గతేడాది పోల్చితే రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. నగర శివారు చుట్టూ 20– 30 కిలోమీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్‌ పెరగడంతో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. 

తక్కువ విస్తీర్ణంపై మొగ్గు
ఈ ఏడాది కొనుగోలు దారులు అధిక శాతం  తక్కువ  విస్తీర్ణం గల ఇళ్లపై మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. విస్తీర్ణం పరంగా చూస్తే, 500 నుంచి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 22 శాతం పైనే ఉండగా గతేడాది  15 శాతంగా నమోదైంది. 1,000 కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు  మాత్రం భారీగా తగ్గా కిందటేడాది ఇండ్ల రిజిస్ట్రేషన్‌లో వీటి వాటా 74 శాతంగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 65 శాతానికి పడిపోయింది.

ఇళ్ల రిజిస్ట్రేషన్లు తక్కువనే.. 
►మహా నగర పరిధిలో రెసిడెన్షియల్‌ మార్కెట్‌ను పరిశీలిస్తే గత ఏడాదితో పోల్చితే  ఈ సారి ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టినా మొత్తం రిజిస్ట్రేషన్లలో  మేడ్చల్‌ జిల్లా వాటా 41 శాతంగా నమోదు కగా, 39 శాతం వాటాతో రంగారెడ్డి జిల్లా , హైదరాబాద్‌ జిల్లా వాటా 14 శాతంగా నమైంది. 
►గ్రేటర్‌లోని  హైదరాబాద్, మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి  పరిధిలో ప్రస్తుత ఏడాదిలో నవంబర్‌ చివరి నాటికి రూ.30,415 కోట్ల విలువ గల  62,159 రెసిడెన్షియల్‌ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరగగా..గత సంవత్సరం ఇదే కాలంలో రూ.33,531 కోట్ల విలువ చేసే 75,453 రెసిడెన్షియల్‌ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రియల్టీ విభాగాల అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
►ఈ ఏడాది నగర శివారులోని రంగారెడ్డి జిల్లాలో 2,49, 135 దస్తావేజులు నమోదైతే గతేడాది  2,74064 దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement