సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాత్రికి రాత్రే పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలను కొనలేరని స్థిరాస్తి నిపుణులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏవీ పట్టించుకోకుండా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటూ మార్కెట్ విలువలను కూడా పెంచేసింది. ఫలితంగా గత నెలలో నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మధ్య తరగతి గృహాల మార్కెట్‌గా పేరొందిన హైదరాబాద్ రియల్టీపై రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయం గట్టి దెబ్బే వేసింది.
రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్‌మెంట్లపై రిజిస్ట్రేషన్ చార్జీల పెరుగుదల ఎక్కువ ప్రభావం చూపించింది. గత నెలలో ఈ కేటగిరీ కేవలం 844 అపార్ట్‌మెంట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే గతేడాది ఫిబ్రవరిలో ఈ విభాగంలో 2,888 ఫ్లాట్లు అమ్ముడుపోవటం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో నగరంలోని గృహ విక్రయాలలో రూ.25 లక్షలలోపు ధర ఉన్న అపార్ట్‌మెంట్ల వాటా 42% కాగా.. ఈ ఏడాది ఫిబ్ర వరి నాటికిది 16%కి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో చూస్తే ఈ విభాగం విక్రయాల వాటా 32 శాతంగా ఉంది.
క్షీణత రెండోసారి: 2022 ఫిబ్రవరిలో నగరంలో రూ.2,722 కోట్ల విలువ చేసే 5,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇందులో 52 శాతం యూనిట్లు రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్నవే. కాగా.. ఈ ఏడాది జనవరిలో రూ.2,695 కోట్ల విలువ చేసే 5,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 6,877 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 25 శాతం తగ్గాయి. సేల్స్‌లో క్షీణత నమోదవటం 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇది రెండోసారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు డిమాండ్: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అపార్ట్‌మెంట్ విక్రయాలలో హైదరాబాద్ వాటా 20 శాతం ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 10 శాతానికి క్షీణించింది. మేడ్చల్–మల్కాజ్‌గిరి వాటా 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డి వాటా 37 శాతం నుంచి 43 శాతానికి, సంగారెడ్డి వాటా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి. "రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల విక్రయాలు గతేడాది ఫిబ్రవరిలో 34 శాతం ఉండగా.. ఇప్పుడవి 52 శాతానికి వృద్ధి చెందాయి. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 7 శాతం నుంచి 9 శాతానికి, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ విక్రయాలు 7 శాతం నుంచి 9 శాతానికి" పెరిగాయి.
16 శాతం డౌన్: గతేడాది ఫిబ్రవరిలోని గృహ విక్రయాలలో 1,000 చ.అ.లోపు విస్తీర్ణం ఉండే మధ్యతరగతి అపార్ట్‌మెంట్ల వాటా 19% ఉండగా.. ఇప్పుడవి 16 శాతానికి పడిపోయాయి. గత నెలలోని అమ్మకాలలో 74 శాతం అపార్ట్‌మెంట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలున్నవే. 2021 ఫిబ్రవరిలో వీటి వాటా 70%గా ఉంది. అలాగే 2,000 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన గృహాలు కూడా 10% నుంచి 11%కి వృద్ధి చెందాయి.
చదవండి: దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్
Comments
Please login to add a commentAdd a comment