సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలో విశ్వక్సేన ఆరాధనతో ఆచార్యులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆరు సంవత్సరాల పాటు బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు జరిగాయి.
ఉద్ఘాటన తర్వాత తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో కొండపై శ్రీస్వామి సన్నిధిలో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలిరానున్నారు. విదేశీ భక్తులు సైతం వచ్చే అవకాశం ఉంది.
ఆర్జిత సేవలు రద్దు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
రూ.1.50 కోట్ల బడ్జెట్
ప్రధానాలయం ఉద్ఘాటన అనంతరం జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.రూ.1.50 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
ఉత్తర మాడ వీధిలో కల్యాణం
28వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణాన్ని ప్రధానాలయం ఉత్తర మాడ వీధిలో నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ షెడ్యూల్..
►21వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం.
►22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం.
►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్సా్యవతార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ.
►24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి, రాత్రి 7గంటలకు హంస వాహన సేవలు.
►25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకారం (మురళీ కృష్ణుడి) సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ.
►26న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి, రాత్రి 7 గంటలకు సింహవాహన సేవలు.
►27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలు, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.
►28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం
►మార్చి 1న ఉదయం 9 గంటలకు మహా విష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.
►2వ తేదీ ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం.
►3వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
Comments
Please login to add a commentAdd a comment