Brahmotsavam begins
-
యాదాద్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలో విశ్వక్సేన ఆరాధనతో ఆచార్యులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆరు సంవత్సరాల పాటు బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉద్ఘాటన తర్వాత తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో కొండపై శ్రీస్వామి సన్నిధిలో వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలిరానున్నారు. విదేశీ భక్తులు సైతం వచ్చే అవకాశం ఉంది. ఆర్జిత సేవలు రద్దు: బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రూ.1.50 కోట్ల బడ్జెట్ ప్రధానాలయం ఉద్ఘాటన అనంతరం జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.రూ.1.50 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఉత్తర మాడ వీధిలో కల్యాణం 28వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణాన్ని ప్రధానాలయం ఉత్తర మాడ వీధిలో నిర్వహించనున్నట్లు అధికారులు ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని సూచించారు. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇదీ షెడ్యూల్.. ►21వ తేదీ ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం. ►22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం. ►23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్సా్యవతార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ. ►24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి, రాత్రి 7గంటలకు హంస వాహన సేవలు. ►25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకారం (మురళీ కృష్ణుడి) సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ. ►26న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి, రాత్రి 7 గంటలకు సింహవాహన సేవలు. ►27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలు, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం. ►28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం ►మార్చి 1న ఉదయం 9 గంటలకు మహా విష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం. ►2వ తేదీ ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం. ►3వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం -
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
-
నూటపదహారు పెళ్లిళ్లు చేసినట్లనిపించింది!
‘‘అమెరికా, ఆల్మైటీ (భగవంతుడు)... ఈ రెండిటికీ నేను రుణపడి ఉంటా. పొట్ట చేతపట్టుకొని విజయవాడ టు అమెరికా వెళ్లిన నాకు ఆ దేశం టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ప్యాషన్ ప్లస్ కన్విక్షన్‌తో పని చేసేవారి చేయి వదలనని ఆ దేవుడు నిరూపించాడు’’ అని పీవీపీ (పొట్లూరి వి. ప్రసాద్) అన్నారు. ‘క్షణం’, ‘ఊపిరి’ వంటి సూపర్ హిట్స్ తర్వాత పీవీపీ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా పీవీపీ చెప్పిన విశేషాలు... ► బ్రహ్మోత్సవం’ కథ విన్నప్పుడు నాకు నా లైఫ్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ తమ జీవితంలోని కనీసం ఒక సంఘటనను అయినా గుర్తుకు తెచ్చే చిత్రం ఇది. సినిమా చూసినవాళ్లు థియేటర్ నుంచి ఒక ‘బెటర్ హ్యూమన్ బీయింగ్’గా బయటకు వస్తారు. ‘ఈ ప్రపంచంలో మంచివాళ్లు ఉంటారు.. తక్కువ మంచివాళ్లు ఉంటారు. చెడ్డవాళ్లు మాత్రం ఉండరు’ అని ఈ సినిమాలో శ్రీకాంత్ చెప్పారు. అది నిజమే. ► ‘క్షణం’ సినిమాకు ‘ఎ ప్రౌడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ పీవీపీ’ అని ఉంటుంది. ‘ఊపిరి’ చివర్లో కూడా అలానే ఉంటుంది. ఇక నుంచీ మా సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా మేం గర్వంగా ఫీలయ్యే విధంగానే ఉంటుంది. అలాంటి సినిమాలనే తీస్తాం. అది చిన్న బడ్జెట్ అయినా.. పెద్దదైనా... ఏ సినిమా చేసినా ‘ఎక్స్లెంట్’గా ఉండాలన్నది నా ఆకాంక్ష. సినిమా అంటేనే వినోదం. ఆ వినోదంతో పాటు విలువలు కూడా ఉంటే నిర్మాతగా లభించే ఆ సంతృప్తే వేరు. ► ఇప్పటివరకూ నిర్మించిన చిత్రాల్లో డబ్బులు తెచ్చినవీ, పోగొట్టినవీ ఉన్నాయి. కొన్ని ఫెయిల్యుర్స్ సినిమా మేకింగ్ మీద అవగాహన పెంచాయి. ఏ సినిమాకైనా ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని తెలిసింది. ఆ రెండూ పర్ఫెక్ట్గా కుదిరితే షూటింగ్ చేయడం ఈజీ. సినిమా రిజల్ట్ కూడా బెటర్‌గానే వస్తుందని నమ్మాను. అందుకు నిదర్శనం ‘క్షణం’, ‘ఊపిరి’. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన సినిమాలే తీశాను. ‘బ్రహ్మోత్సవం’తో పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన కూడా ఇందులో ఉంటుంది. అన్ని వయసులవాళ్ళూ చూడదగ్గ సినిమా ఇది. బంధువులు, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా. ► ఈ సినిమాకి దాదాపు 116 రోజులు పని చేశాం. తెరనిండా నటీనటులు ఉంటారు. అందరూ పేరున్నవాళ్లే. తోట తరణి, రత్నవేలు వంటి టాప్ టెక్నీషియన్స్ చేశారు. అందరి డేట్స్ సర్దుబాటు చేసుకుని తీయడం కొంచెం కష్టం అయ్యింది. కానీ, షూటింగ్ మొత్తం ఉత్సవంలా జరిగింది. 116 పెళ్లిళ్లు చేసిన ఫీల్‌ని కలిగించింది. ► ‘బ్రహ్మోత్సవం’ స్టార్ట్ చేసినప్పుడే ఈ సినిమాకి మహేశ్‌బాబు ‘ఎంబి కార్పొరేషన్’ అసోసియేట్ అయ్యేట్లుగా నిర్ణయమైంది. మహేశ్‌బాబు నటించడంతో ఈ సినిమాకో భారీతనం వచ్చింది. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్‌ని తెరపై చూసి ఎంత పరవశించిపోయారో, ఇప్పుడు ఈ సినిమాలో మహేశ్‌ని చూసే అంతే పరవశించిపోతారు. మళ్లీ మహేశ్‌బాబుతో మరో సినిమా చేయడానికి రెడీ. ► జీవితంలో కాంప్రమైజ్ అయ్యి బతకకూడదన్నది నా ఫిలాసఫీ. కన్విక్షన్‌తో బతకాలి. అలా బతకడం కొంచెం కష్టమే. కానీ, నాకదే ఇష్టం. సినిమా మేకింగ్ విషయంలో రాజీపడను. ఎవరికీ భయపడను. నిర్మాతగా నా టేస్ట్ మేరకే సినిమాలు తీస్తాను. సినిమా అనేది నాకు ‘అవసరం’ కాదు...‘ప్యాషన్’. అందుకే ఇండియన్ సినిమాలో తొలిసారిగా అనదగ్గ చిత్రం తీయాలనే తపనతో తొలి సబ్ మెరైన్ మూవీ ‘ఘాజీ’ తీస్తున్నాను. ఇంకో రెండు కథలు రెడీగా ఉన్నాయి. ► ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వ్యక్తిని నేను. గతాన్ని ఎప్పటికీ మర్చిపోను. నేను టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే ‘జీవితంలో తప్పకుండా మంచి స్థితిలో ఉంటా’ అని నమ్మాను. నా టీచర్లు కూడా నన్ను నమ్మారు. ఇవాళ నేనెంత సంపాదించినా ‘నీ ఆస్తి ఏంటి’ అని అడిగితే.. ‘హ్యాపీనెస్’ అని చెబుతా. ముందున్న జీవితం గురించి ఆలోచిస్తూనే వెనక ఉన్న జీవితం తాలూకు ఆనవాళ్లను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల మధ్య బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5.36 నిముషాల నుంచి 6.00 గంటల మధ్య మీన లగ్నమందు ధ్వజారోహణం ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి ఏపీ సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు రాత్రి 7.45 గంటలకు స్వామి వారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారని టీటీడీ ఆలయ ఈవో ఎంజీ గోపాల్ వెల్లడించారు. తిరుమల చేరుకునేందుకు చంద్రబాబు ప్రయాణించే అలిపిరి టోల్గేట్ నుంచి రెండవ ఘాట్ రోడ్డు వద్ద భారీగా బందోబస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే చంద్రబాబు పర్యటించే అన్ని ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించినట్లు చెప్పారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు ఆర్టీసీ మరిన్ని బస్సు సర్వీసులను నడుపుతుందని ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు.