నూటపదహారు పెళ్లిళ్లు చేసినట్లనిపించింది!
‘‘అమెరికా, ఆల్‌మైటీ (భగవంతుడు)... ఈ రెండిటికీ నేను రుణపడి ఉంటా. పొట్ట చేతపట్టుకొని విజయవాడ టు అమెరికా వెళ్లిన నాకు ఆ దేశం టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ప్యాషన్ ప్లస్ కన్విక్షన్‌తో పని చేసేవారి చేయి వదలనని ఆ దేవుడు నిరూపించాడు’’ అని పీవీపీ (పొట్లూరి వి. ప్రసాద్) అన్నారు. ‘క్షణం’, ‘ఊపిరి’ వంటి సూపర్ హిట్స్ తర్వాత పీవీపీ సంస్థ నుంచి వస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా పీవీపీ చెప్పిన విశేషాలు...
► బ్రహ్మోత్సవం’ కథ విన్నప్పుడు నాకు నా లైఫ్ కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందరికీ తమ జీవితంలోని కనీసం ఒక సంఘటనను అయినా గుర్తుకు తెచ్చే చిత్రం ఇది. సినిమా చూసినవాళ్లు థియేటర్ నుంచి ఒక ‘బెటర్ హ్యూమన్ బీయింగ్’గా బయటకు వస్తారు. ‘ఈ ప్రపంచంలో మంచివాళ్లు ఉంటారు.. తక్కువ మంచివాళ్లు ఉంటారు. చెడ్డవాళ్లు మాత్రం ఉండరు’ అని ఈ సినిమాలో శ్రీకాంత్ చెప్పారు. అది నిజమే.
► ‘క్షణం’ సినిమాకు ‘ఎ ప్రౌడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ పీవీపీ’ అని ఉంటుంది. ‘ఊపిరి’ చివర్లో కూడా అలానే ఉంటుంది. ఇక నుంచీ మా సంస్థ నుంచి వచ్చే ప్రతి సినిమా మేం గర్వంగా ఫీలయ్యే విధంగానే ఉంటుంది. అలాంటి సినిమాలనే తీస్తాం. అది చిన్న బడ్జెట్ అయినా.. పెద్దదైనా... ఏ సినిమా చేసినా ‘ఎక్స్‌లెంట్’గా ఉండాలన్నది నా ఆకాంక్ష. సినిమా అంటేనే వినోదం. ఆ వినోదంతో పాటు విలువలు కూడా ఉంటే నిర్మాతగా లభించే ఆ సంతృప్తే వేరు.
► ఇప్పటివరకూ నిర్మించిన చిత్రాల్లో డబ్బులు తెచ్చినవీ, పోగొట్టినవీ ఉన్నాయి. కొన్ని ఫెయిల్యుర్స్ సినిమా మేకింగ్ మీద అవగాహన పెంచాయి. ఏ సినిమాకైనా ప్రీ-ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ముఖ్యం అని తెలిసింది. ఆ రెండూ పర్ఫెక్ట్‌గా కుదిరితే షూటింగ్ చేయడం ఈజీ. సినిమా రిజల్ట్ కూడా బెటర్‌గానే వస్తుందని నమ్మాను. అందుకు నిదర్శనం ‘క్షణం’, ‘ఊపిరి’. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన సినిమాలే తీశాను. ‘బ్రహ్మోత్సవం’తో పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాను. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన కూడా ఇందులో ఉంటుంది. అన్ని వయసులవాళ్ళూ చూడదగ్గ సినిమా ఇది. బంధువులు, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా.
► ఈ సినిమాకి దాదాపు 116 రోజులు పని చేశాం. తెరనిండా నటీనటులు ఉంటారు. అందరూ పేరున్నవాళ్లే. తోట తరణి, రత్నవేలు వంటి టాప్ టెక్నీషియన్స్ చేశారు. అందరి డేట్స్ సర్దుబాటు చేసుకుని తీయడం కొంచెం కష్టం అయ్యింది. కానీ, షూటింగ్ మొత్తం ఉత్సవంలా జరిగింది. 116 పెళ్లిళ్లు చేసిన ఫీల్‌ని కలిగించింది.
► ‘బ్రహ్మోత్సవం’ స్టార్ట్ చేసినప్పుడే ఈ సినిమాకి మహేశ్‌బాబు ‘ఎంబి కార్పొరేషన్’ అసోసియేట్ అయ్యేట్లుగా నిర్ణయమైంది. మహేశ్‌బాబు నటించడంతో ఈ సినిమాకో భారీతనం వచ్చింది. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్‌ని తెరపై చూసి ఎంత పరవశించిపోయారో, ఇప్పుడు ఈ సినిమాలో మహేశ్‌ని చూసే అంతే పరవశించిపోతారు. మళ్లీ మహేశ్‌బాబుతో మరో సినిమా చేయడానికి రెడీ.
► జీవితంలో కాంప్రమైజ్ అయ్యి బతకకూడదన్నది నా ఫిలాసఫీ. కన్విక్షన్‌తో బతకాలి. అలా బతకడం కొంచెం కష్టమే. కానీ, నాకదే ఇష్టం. సినిమా మేకింగ్ విషయంలో రాజీపడను. ఎవరికీ భయపడను. నిర్మాతగా నా టేస్ట్ మేరకే సినిమాలు తీస్తాను. సినిమా అనేది నాకు ‘అవసరం’ కాదు...‘ప్యాషన్’. అందుకే ఇండియన్ సినిమాలో తొలిసారిగా అనదగ్గ చిత్రం తీయాలనే తపనతో తొలి సబ్ మెరైన్ మూవీ ‘ఘాజీ’ తీస్తున్నాను. ఇంకో రెండు కథలు రెడీగా ఉన్నాయి.
► ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వ్యక్తిని నేను. గతాన్ని ఎప్పటికీ మర్చిపోను. నేను టెన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే ‘జీవితంలో తప్పకుండా మంచి స్థితిలో ఉంటా’ అని నమ్మాను. నా టీచర్లు కూడా నన్ను నమ్మారు. ఇవాళ నేనెంత సంపాదించినా ‘నీ ఆస్తి ఏంటి’ అని అడిగితే.. ‘హ్యాపీనెస్’ అని చెబుతా. ముందున్న జీవితం గురించి ఆలోచిస్తూనే వెనక ఉన్న జీవితం తాలూకు ఆనవాళ్లను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను.