సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్‌ఏలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ టెన్నిస్ హెల్పర్‌లుగా 21 మంది పేర్లతో నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్ ఓ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రోజూ సాయంత్రం 5.30 గంటలకు నిర్మల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వెనకే ఉన్న గ్రౌండ్‌లో సహచర అధికారులతో కలిసి టెన్నిస్ ఆడతారు. కలెక్టర్ టెన్నిస్ ఆడే సమయంలో కోర్టు వద్ద బంతులు అందించేందుకు రోజుకీ ముగ్గురు చొప్పున వారానికి 21 మంది వీఆర్‌ఏలకు తహసీల్దార్ ప్రత్యేక విధులు కేటాయించారు. వీరిపై పర్యవేక్షణకు మరో ఏడుగురు వీఆర్‌వోలను నియమిస్తూ సోమవారం డీ/777/2020 నంబర్‌తో ప్రత్యేక ప్రొసీడింగ్ జారీ చేశారు.
ఈ వ్యవహారం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కలెక్టర్ ఆదేశాలతోనే తహసీల్దార్ ఈ జాబితా రూపొందించారా, లేక తహసీల్దారే అత్యుత్సాహంతో జాబితాను విడుదల చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వీఆర్‌ఏలకు విధులు అప్పజెప్పడంపై వివాదం చేలరేగడంతో వీఆర్‌ఏలను కలెక్టర్ వెనక్కి పంపారు. వీఆర్‌ఏలు లేకుండా బుధవారం గేమ్ ఆడారు.
చదవండి: పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేయం: గంగుల కమలాకర్
Comments
Please login to add a commentAdd a comment