సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా గణనీయంగానే జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 20,16,461 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం బులెటిన్‌లో వెల్లడించారు. గత నెల 10 నాటికి 6,42,875 టెస్టులు జరిగాయి. అలాగే ప్రతీ పది లక్షల మందిలో 17,315 మందికి పరీక్షలు నిర్వహించారు. అప్పట్నుంచి ఈ నెల రోజుల వ్యవధిలో అదనంగా 13,73,586 కరోనా టెస్టులు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
అలాగే తాజాగా ప్రతీ పది లక్షల మందిలో 54,313 మందికి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నెల క్రితం 82,647 పాజిటివ్ కేసులుండగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 1,52,602కు పెరిగింది. ఈ నెల రోజుల్లో కేసులు 69,955 పెరిగాయి. నెల క్రితం మరణాల సంఖ్య 645 ఉండగా, ఇప్పుడు 940కి చేరాయి. అంటే నెల రోజుల్లో అదనంగా 295 మరణాలు పెరిగాయి. ఇప్పటివరకు 1,19,467 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 32,195 యాక్టివ్ కేసులుండగా, అందులో 25,240 మంది ఇళ్లు, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో రికవరీ రేటు 78.2 శాతంగా ఉంది. మరణాల రేటు 0.61 శాతం ఉంది.
ఒక్కరోజులో 2,426 మందికి..
ఇక గురువారం 62,890 మందికి పరీక్షలు చేయగా, 2,426 మందికి పాజిటివ్ వచ్చినట్లు బులెటిన్‌లో వెల్లడించారు. అలాగే 2,324 మంది వైరస్ నుంచి కోలుకోగా, 13 మంది మరణించారు. టెస్టుల్లో ప్రైమరీ కాంటాక్టుకు సంబంధించినవి 28,300 (45%) ఉండగా, సెకండరీ కాంటాక్టువి 8,804 (14%) ఉన్నాయి. మిగిలినవి డైరెక్ట్ కాంటాక్టులని తెలిపారు. ఇటు తాజాగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 338 వచ్చాయి.
కేసులు ఎక్కువున్న జిల్లాల విషయానికొస్తే.. రంగారెడ్డిలో 216, మేడ్చల్‌లో 172, నల్లగొండలో 164, కరీంనగర్‌లో 129, వరంగల్ అర్బన్‌లో 108 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా చికిత్స చేసే ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 199కి చేరింది. అందులో ప్రస్తుతం 10,388 పడకలు కరోనాకు కేటాయించారు. వాటిల్లో 4,287 నిండిపోగా, 6,101 పడకలు ఖాళీగా ఉన్నట్లు బులెటిన్‌లో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment