భద్రయ్యస్వామి, శంభులింగం, శశికళ
సాక్షి, దామరగిద్ద: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు, తండ్రిని బలి తీసుకుంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మొగుల్‌మడ్కకు చెందిన జంగం భద్రయ్యస్వామి (65), శశికళ (60) భార్యాభర్తలు. వీరికి కుమారులు నాగరాజు, శంభులింగం, శాంతయ్య, ఓ కుమార్తె ఉన్నారు. భద్రయ్య ఆర్‌ఎంపీగా పనిచేశాడు. రెండో కుమారుడు శంభులింగం కూడా అదే వృత్తిలో ఉన్నాడు. పెద్దకుమారుడు చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తుండగా.. చిన్న కొడుకు మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితాలను ఒక్కసారిగా కరోనా వైరస్ దెబ్బకొట్టింది.
ఇరవై రోజుల క్రితం శంభులింగం (42)కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆరు రోజుల క్రితం భద్రయ్యస్వామి కూడా కరోనా బారిన పడడంతో మహబూబ్‌నగర్‌లోని జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భద్రయ్య భార్య శశికళ భర్త, కుమారుడిని చూసేందుకు మూడు రోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు వెళ్లింది. అప్పటికే ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేసి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడన్న ఆందోళన, భర్త కూడా ఆస్పత్రిలో చేరాడన్న బెంగతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత మృతి చెందింది. మరోవైపు తల్లి మృతి చెందిన ఆరు గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడు శంభులింగం పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం 8 గంటలకు చనిపోయాడు.
భద్రయ్య పెద్ద కుమారుడు నాగరాజు తల్లి, తమ్ముడి మృతదేహాలను అంత్యక్రియల కోసం ఇంటికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి భద్రయ్య కూడా మృతి చెందినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. దాంతో మొదట తల్లి, సోదరుడి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత తండ్రి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. కరోనా కారణంగా గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా శంభులింగం ప్రాణాలు దక్కలేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment