Telangana, Five Private Hospitals In Hyderabad Lose Permit To Treat Covid - 19 - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ చికిత్సల నుంచి.. 5 ఆస్పత్రులు ఔట్‌

Published Sat, May 29 2021 12:48 AM | Last Updated on Sat, May 29 2021 2:39 PM

5 Private Hospitals Lose Permission to Treat Covid-19 Patients In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలో నిర్లక్ష్యం, అడ్డగోలుగా చార్జీలు వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆయా ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సల అనుమతిని రద్దు చేసింది. కొత్తగా కోవిడ్‌ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా ఆస్పత్రుల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలిచ్చింది.


వరుస ఫిర్యాదులతో..
కరోనా చికిత్సలో నిర్లక్ష్యం, భారీ వసూళ్లపై ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇందులో 66 ఆస్పత్రులపై ఆధారాలతో సహా అందిన 88 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల తీవ్రత, నోటీసుల పట్ల యాజమాన్యాల స్పందన ఆధారంగా చర్యలు చేపట్టారు. ఐదు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స అనుమతులను రద్దు చేశారు. ఈ జాబితాలో బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్, సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్, కూకట్‌పల్లిలోని మాక్స్‌ హెల్త్‌ హాస్పిటల్, కాచిగూడలోని టీఎక్స్‌ హాస్పిటల్, బేగంపేట్‌లోని వీఐఎన్‌ఎన్‌ ఆస్పత్రి ఉన్నాయి. ఇకపై కొత్తగా కోవిడ్‌ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే చికిత్స పొందుతున్నవారికి నిబంధనల ప్రకారం చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు ఫిర్యాదులకు సంబంధించి మరికొన్ని ఆస్పత్రులకు కూడా అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆయా ఆస్పత్రుల నుంచి వివరణ తీసుకుని పరిశీలిస్తున్నారు.


సర్వీసులో నిర్లక్ష్యంతో
రోగులకు చికిత్స చేయడంలో బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారంటూ నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఆస్పత్రికి షోకాజ్‌ నోటీసు ఇచ్చి, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు చేపట్టారు.


అధిక వసూళ్లతో..
కరోనా బాధితుల నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ... బేగంపేటలోని వీఐఎన్‌ఎన్‌ హాస్పిటల్‌పై మోహసీన్‌ ఉస్మానీ, గౌరమ్మ, కె.సుభాష్, రామచంద్ర, సంధ్య తదితరులు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కాచిగూడలోని టీఎక్స్‌ హాస్పిటల్‌పై దయాకర్, సయ్యద్‌ గౌసియా బేగం.. సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్‌పై షేక్‌ గులామ్‌ ముస్తఫా... కూకట్‌పల్లిలోని మాక్స్‌ హెల్త్‌ హాస్పిటల్స్‌పై బాధితురాలు శశికళ వైద్యశాఖకు ఫిర్యాదులు చేశారు. వీటిపై స్పందించిన అధికారులు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో.. కోవిడ్‌ చికిత్స అనుమతులను రద్దు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement