హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇక సర్కారు కొలువుదీరడమే తరువాయి. సీఎం అభ్యర్థిపై ఇప్పటికే ఆ పార్టీ అధి ష్టానం చర్చలు జరుపుతోంది. త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఫలితాలు వెలువడి రోజైనా గడవక ముందే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అధికారం చేపట్టబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే హామీలు ఇచ్చింది.. ఎలా అమలు చేస్తుంది.. అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.
రూ.500లకే గ్యాస్ సిలిండర్, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హామీల్లో ప్రధానమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి. బస్సుల్లో మహిళలు టిక్కెట్లు తీసుకోవద్దని, మహిళలకు డబ్బులు వస్తాయని.. ఇలా పలు రకాల ప్రచారాలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఆరు గ్యారంటీలపై...
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే పార్టీ పేర్కొన్న పథకాలపై ప్రచారం షురూ అయ్యింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2500 నగదుపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందిస్తున్న ఆసరా పింఛన్ ఉంటుందా?.. దానికే రూ.500 కలిపి అందిస్తారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై సైతం మహిళల్లో ఆసక్తి నెలకొంది.
ఇందిరమ్మ ఇండ్ల కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, రైతు భరోసా కింద ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు, వరిపంటపై రూ.500 బోనస్, తదితర అంశాలపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామన్న హామీపై నిరుద్యోగుల్లో ఆశలు నెలకొన్నాయి. యువ వికాసంలో భాగంగా విద్యార్థులకు రూ.5లక్షల వరకు విద్యాభరోసా కార్డు, చేయూత కింద వృద్ధులకు రూ.4వేల పింఛన్, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, తదితర గ్యారంటీ హామీలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment