కొత్తగా మరో 8 మెడికల్‌ కాలేజీలు | 8 new medical colleges in telangana | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు.. 8 కొత్త కాలేజీలకు అనుమతులు

Published Sun, Aug 7 2022 7:23 AM | Last Updated on Sun, Aug 7 2022 2:25 PM

8 new medical colleges in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశయసాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. తాజాగా మూడో విడత కింద మరో 8 జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానాల అప్‌గ్రేడేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీచేసింది. ఈ మేరకు మెడికల్‌ కాలేజీల వారీగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు.

తాజాగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. దీంతో ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతోపాటు వీటిల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా సాగుతోంది.

రెండోవిడతగా మరో 8 వైద్యకళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రతి కాలేజీలో వంద ఎంబీబీఎస్‌ సీట్లకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేయనున్నారు. కాలేజీల భవన నిర్మాణాలను ఆర్‌ అండ్‌ బీ శాఖకు అప్పగించింది.

హాస్పిటల్‌ భవనాల అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్‌ కొనుగోలు బాధ్యతలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగించింది. ఆయా మెడికల్‌ కాలేజీలకు అటాచ్‌ చేస్తున్న హాస్పిటల్‌ను వైద్యవిధాన పరిషత్తు పరిధి నుంచి డీఎంఈ పరిధికి బదిలీ చేసింది. ఈ 8 మెడికల్‌ కాలేజీలను మొత్తం రూ.1479 కోట్లతో ఏర్పాటు చేస్తోంది.
చదవండి: బెస్టాఫ్‌ ‘లక్క’!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement