
సాక్షి, భైంసా: అసలే కరోనా కాలం.. బడులు మూతపడ్డాయి. పిల్లలంతా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి సాయికృష్ణ మాత్రం తన ఆలోచనకు పదును పెట్టాడు. రోజూ తను చూసే సైకిల్‌కు ఎలక్ట్రికల్ పరికరాలు బిగించి.. రూ.8 వేలలోనే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. చూసినవాళ్లు అతడిని మెచ్చుకుంటున్నారు.
సాయికృష్ణ తండ్రి పోతన్న గుమాస్తా. తల్లి సురేఖ బీడీ కార్మికురాలు. బడులు మూతపడడంతో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నాడు. తన వద్ద ఉన్న సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్చే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. వెంటనే తన సైకిల్‌కు రెండు బ్యాటరీలు, ఒక హెవీ మోటార్‌ను బిగించి వాటిని వైర్లతో అనుసంధానించాడు. ఈ రెండు బ్యాటరీలను ఒక్కసారి చార్జింగ్ చేస్తే.. మోటార్ సాయంతో 50 కిలోమీటర్ల వరకు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని చెబుతున్నాడు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి రూ.8 వేల వరకు ఖర్చయిందని, ఆ డబ్బు తన తండ్రి ఇచ్చాడని తెలిపాడు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడీ బాలుడు.
( చదవండి: యాక్టింగ్ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు.. )
Comments
Please login to add a commentAdd a comment