సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఎనిమిది శాతం పెరిగాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో సంబంధిత వైద్యులను, అధికారులను ఆయన అభినందించారు. ఈ సేవలను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. సర్జరీలు పెరగాలని, అన్ని వైద్య పరికరాలు పూర్తిస్థాయి వినియోగంలో ఉండాలని ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీలు చేయాలని వైద్యాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై మంత్రి నెలవారీ సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవో రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆరోగ్యశ్రీ అధికారులు, జిల్లా కో–ఆర్డినేటర్లు, టీమ్ లీడర్లు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, 2019–20లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరోగ్యశ్రీ సేవలు 35 శాతం ఉంటే, 2021–22లో అవి 43 శాతానికి పెరిగాయన్నారు.
ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేయాలని, అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని సూచించారు. 26 సీఆర్మ్ మెషీన్లు పంపిణీ చేశామని, చిన్న చిన్న పరికరాలు అవసరం ఉంటే కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆర్థో సర్జరీలు పెరగాలని, మోకాలు ఆపరేషన్లు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో చేయాలని, అందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల సహకారం తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అదే రీతిలో మాతా, శిశు మరణాలు పూర్తిగా తగ్గించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment