Adilabad: అవార్డులు అందని ద్రాక్షేనా? | Adilabad PHCs, Urban Health Centres Fails to Get NHM Award | Sakshi
Sakshi News home page

Adilabad: అవార్డులు అందని ద్రాక్షేనా?

Published Fri, Jul 8 2022 1:54 PM | Last Updated on Fri, Jul 8 2022 3:12 PM

Adilabad PHCs, Urban Health Centres Fails to Get NHM Award - Sakshi

ఈ చిత్రంలో కనిపిస్తోంది బజార్‌హత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. చూడటానికి భవనం ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకు తగ్గట్టే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కాయకల్ప అవార్డు వరుసగా మూడు సంవత్సరాలు అందుకుంది. నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్స్‌ అవార్డు కూడా దక్కింది. అయితే ఈసారి మాత్రం ఈ అవార్డుకు పోటీ పడటంలో వెనుకబడింది. దీనికి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్‌లో కొన్ని అంశాల్లో వెనుకబడడంతో ఈ పరిస్థితి ఉంది.


ఈ చిత్రంలో కనిపిస్తోంది తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఆవరణలో ఈ ఫ్లోరింగ్‌ మొత్తం పగిలిపోయి ఉంది. భవనంలో విద్యుత్‌ వైరింగ్‌ సరిగ్గా లేదు. 1956లో ఈ పీహెచ్‌సీ ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాణాలు మెరుగుపర్చే చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. అలా జరిగితేనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆస్పత్రులకు నిధులు వస్తాయి. మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయి.

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులను అందుకోవడంలో వెనుకంజలో ఉన్నాయి. ప్రమాణాలను అందుకోలేక పోతున్నాయి. ఒకవేళ వసతులను మె రుగుపర్చుకుంటూపోతే అధిక పాయింట్స్‌ సాధించడం ద్వారా ప్రత్యేక నిధులు పొందే అవకాశం ఉంటుంది. కాయకల్ప ప్రమాణాలు అందుకుంటే రూ. 2లక్షల నిధులు ఇవ్వనున్నారు. వీటి ఆధారంగా మ రిన్ని వసతులు మెరుగుపర్చుకొని జాతీయ ప్రమాణాలు అందుకుంటే నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్స్‌ అవార్డు అందుకుంటాయి. మూడేళ్లపాటు ఒక్కో సంవత్సరం రూ.3 లక్షలు అందుతాయి.

కొన్నింటికే అవార్డులు..
జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను విడివిడిగా పరిగణలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రమాణాలను అంచనా వేసి అవార్డులు ఇస్తున్నాయి. జిల్లాలో మొత్తం 22 పీహెచ్‌సీలు, 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. 5 పీహెచ్‌సీలు, 2 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు మాత్రమే కాయకల్పకు మొదట ఎంపికై ఆ తర్వాత ప్రమాణాలను దాటుకుని నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్స్‌ను అందుకోవడం ద్వారా వరుసగా మూడేళ్లు రూ.3 లక్షల చొప్పున అందుకున్నాయి. అయితే బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీకి సంబంధించి ప్రహరీ నిర్మాణం లేకపోవడం, స్వచ్ఛభారత్‌ అంశాల్లో పాయింట్లు తగ్గడంతో మరోసారి జాతీయ అవార్డు వస్తుందో? రాదోనని అక్కడి జెడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య ఇటీవల జెడ్పీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా జిల్లాలోని మిగితా ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రమాణాలను అందుకునేందుకు పోటీ పడకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. ఆస్పత్రిలో లైటింగ్, వెయిటింగ్, బాహ్య, అంతర్గత నిర్వహణ సరిగ్గా ఉండాలి. రోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. విధులు సక్రమంగా నిర్వహించాలి వంటి అంశాలు ప్రమాణాలుగా ఉన్నాయి. ప్రధానంగా ఆస్పత్రి స్వరూపం ఆకర్షణీయంగా ఉండాలి. ఆ పరిసరాల్లో పశువుల సంచారం లేకుండా చూడాలి. గార్డెనింగ్‌ నిర్వహణ చేయాలి. ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. 

ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు
ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేవని జెడ్పీ సమావేశంలో ప్రస్తావనకు తీసుకురావడం పట్ల ఎమ్మెల్యేలు ఆక్షేపణ వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రతి పీహెచ్‌సీలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిరంతరంగా నిర్వహిస్తే అక్కడే సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఈ పదిహేను రోజుల్లో అన్ని పీహెచ్‌సీల సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరుగుతుందని, తద్వారా సదుపాయాలు మెరుగవుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాయకల్ప ప్రమాణాల్లో వెనుకంజ
బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీకి వరుసగా మూడేళ్లపాటు కాయకల్ప అవార్డు దక్కింది. ఈసారి పాయింట్స్‌లో వెనుకబడింది. ప్రహరీ నిర్మాణం లేకపోవడం, అక్కడ ఆక్రమణలు చోటు చేసుకోవడం, ఇతరత్రా అంశాల పరంగా సరైన పాయింట్స్‌ రాలేదు. ఈ సమస్యలను పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోంది.
– మల్లెపూల నర్సయ్య, జెడ్పీటీసీ, బజార్‌హత్నూర్‌

జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు కృషి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపర్చడం ద్వారా కాయకల్ప అవార్డుతో పాటు జాతీయ ప్రమాణాలు కూడా అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే ఏడు ఆస్పత్రులకు జాతీయ అవార్డు అందడం జరిగింది.
– నరేందర్‌ రాథోడ్, డీఎంహెచ్‌ఓ, ఆదిలాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement