జిల్లా కేంద్రంలోని శాంతినగర్ అర్బన్‌హెల్త్ సెంటర్‌కు సోమవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చారు. వారికి ఆరోగ్య కేంద్ర సిబ్బంది టోకెన్లు అందజేసి మధ్యాహ్నం 12గంటలకు నమూనాలు సేకరిస్తామని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగారు. అయితే కొంత ఆలస్యంగా మళ్లీ వారు ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడం, అప్పటికే మిగితా వారికి పరీక్షలు పూర్తయ్యాయి. ర్యాపిడ్ యాంటిజన్ టెస్ట్ కిట్లు అయిపోయాయని, రేపు రమ్మని సిబ్బంది చెప్పడంతో మరోమారు వారు వెనుదిరిగారు. సాయంత్రం వారి సెల్‌ఫోన్లకు పరీక్ష ఫలితాలు నెగిటివ్ అని రావడంతో నివ్వెరపోయారు’. అసలు పరీక్ష చేసుకోకముందు ఫలితం ఎలా వచ్చిందని విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో నిర్ధారిత పరీక్షల్లో గందరగోళం నెలకొంది. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్నాయి.
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన గల శాంతినగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కరోనా టెస్టుల్లో గందరగోళం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట వికలాంగుల కాలనీకి చెందిన ఓ ఉపాధ్యాయుడు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిశాడు. కరోనా సోకిందనే అనుమానంతో టెస్టు చేయించేందుకు అక్కడికి వచ్చాడు. పరీక్ష చేసిన తర్వాత వైద్య సిబ్బంది ఆయనకు నెగిటివ్ అని చెప్పారు. అనంతరం రాత్రి సమయంలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో రాత్రంతా ఆయన భయాందోళనకు గురయ్యారు. ఉదయం శాంతినగర్ అర్బన్‌హెల్త్ సెంటర్‌లో రికార్డు చూడగా ఆయనకు నెగిటివ్‌గా వచ్చింది. పరీక్షలు చేయించుకున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు ఒకే విధంగా ఉండడంతో రిపోర్టు మారినట్లు తెలిసింది. అయినప్పటికీ భయంతో మరోమారు అక్కడే పరీక్ష చేసుకుంటే కరోనా నెగిటివ్ వచ్చింది. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీకి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా పరీక్ష కోసం శాంతినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఉదయం 10గంటలకు 50 నుంచి 54 వరకు వీరికి టోకెన్లు అందజేశారు. మధ్యాహ్నం రావాలని సిబ్బంది చెప్పడంతో వారు ఒంటిగంటకు వెళ్లారు. ఆ సమయానికి కరోనా టెస్టులు నిలిపివేయడం, వీరి నమూనాలను తీసుకోకపోవడంతో వారు వెనుదిరిగారు. అయితే సాయంత్రం సమయంలో ఆ ఐదుగురికి నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఫోన్‌లకు సంక్షిప్త సమాచారం అందింది. దీంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
పునరావృతమవుతున్న ఘటనలు...
కరోనా పరీక్షల్లో కొంత గందరగోళం నెలకొంటుంది. కొంతమంది పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫోన్‌కు మెస్సేజ్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతుండగా, మరికొంత మందికి మొదట నెగిటివ్ అని చెప్పి.. ఆ తర్వాత పాజిటివ్ అంటూ మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఏ సమాచారం నిజమో తెలియక బాధితులు తికతమక పడుతున్నారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ గర్భిణులు ఇటీవల జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. అక్కడ సిబ్బంది ఆమెకు నెగిటివ్ అని చెప్పారు. ఫోన్‌కు మాత్రం కరోనా పాజిటివ్ అని మెస్సేజ్ వచ్చింది. దీంతో ఆ గర్భిణి ఆందోళనకు గురైంది. ఉదయం పూటనే భీంపూర్ పీహెచ్‌సీలో మరోమారు కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆమె గర్భిణి కావడంతో రిమ్స్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోగా అప్పుడు కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కొంతమంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పర్యవేక్షణ కరువు...
ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కరోనా పరీక్షలు చేయడం, కరోనా నివారణ టీకాలు వేయాల్సి ఉండగా, మధ్యాహ్నం 12గంటలకు కరోనా పరీక్షలు ప్రారంభించి ఒంటిగంట లోపు ముగిస్తున్నారు. టీకాలను ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వేస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా, వీరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసమే నెగిటివ్ అని
కరోనా నిర్ధారణ పరీక్ష కోసం సేకరించిన నమూనాల్లో 20శాతం ఆర్టీసీపీఆర్ కోసం పంపడం జరుగుతుంది. ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ అని చూపించినప్పుడే ఆర్టీపీసీఆర్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో నమోదవుతోంది. అందుకోసమే నెగిటివ్ అనే రిపోర్టు పంపడం జరిగింది.
– కిరణ్‌కుమార్, శాంతినగర్ యూపీఎహెచ్‌సీ వైద్యాధికారి
( చదవండి: రెమ్‌డెసివిర్ కావాలంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి )
Comments
Please login to add a commentAdd a comment