సాక్షి, హైదరాబాద్: నేరాలు జరిగినప్పుడు వాటిని ఛేదించేందుకు ఫింగర్ ప్రింట్స్ కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి ఫింగర్ ప్రింట్స్ సేకరణ, తరువాత వాటిని విశ్లేషించడానికి అవసరమైన అధునాతన కిట్స్‌ను రాష్ట్ర సీఐడీ విభాగం సమకూర్చుకుంది. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఫింగర్ ప్రింట్ కిట్స్‌ను సీఐడీ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆరు జోన్లలోని అధికారులకు అందజేశారు.
ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్‌బీ నగర్ జోన్, సైబరాబాద్‌లోని శంషాబాద్ జోన్, హైదరాబాద్ నగరంలోని సౌత్, నార్త్, వెస్ట్, సెంట్రల్ జోన్లకు ఈ కిట్లను అందించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఫింగర్ ప్రింట్ యూనిట్లకు వీటిని అందచేయనున్నట్లు మహే ష్భగవత్ చెప్పారు. సీఐడీలోని ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ తాతా రావు మాట్లాడుతూ ఒక్కో కిట్‌లో మొత్తం తొమ్మిది రకాల వస్తువులు ఉంటాయని తెలిపారు.
మాస్టర్ ఎక్స్‌పర్ట్ లేటంట్ ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్, లెటంట్ బ్రషెస్, మాగ్నటిక్ పౌడర్ అప్లికేటర్, పోస్టు మార్టమ్ ఇంక్ టూల్, ఇంక్డ్ స్ట్రిప్స్, మాగ్నటిక్ పౌడర్స్, లెటెంట్ ప్రింట్ బేసిక్ పౌడర్స్, పోర్టబుల్ మల్టీబాండ్ లైట్‌సోర్స్ ఉంటాయి. కార్యక్రమంలో సీఐడీ అధికారులు ఎం.నారాయణ(అడ్మిన్), ఆర్ వెంకటేశ్వర్లు(ఎస్‌సీఆర్‌బీ) రవీందర్(నార్కొటిక్స్), డీఎస్పీ నందుకుమార్(ఎఫ్‌పీబీ) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment