
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీనపడుతుందని, 16 ఏళ్లు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్ హుస్సేన్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్‌పై యువత నిరసనలు చేపడుతున్నా, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. రేవంత్ మాట్లాడుతూ మోదీ చదువుకోకపోవడం వల్ల ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆర్మీకి, బీఎస్‌ఎఫ్‌కు తేడా ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.