
సాక్షి, హన్మకొండ: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓయూ విద్యార్థి భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, నరేష్ సోదరుడు అగ్నితేజ్.. నరేష్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు చేశాడు. దీంతో, మరోసారి దుమారం చోటుచేసుకుంది.
కాగా, ఈ పోస్టు అనంతరం అగ్నితేజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం రాములపల్లికి చెందిన నరేష్ కుటుంబసభ్యుడు అగ్నితేజ్‌ను అరెస్ట్ చేసి మెజీస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎవరైనా రెచ్చగొట్టే విధంగా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించకూడదని కోరారు.
మరోవైపు.. సోషల్ మీడియాలో అగ్నితేజ్ పోస్ట్ కారణంగా అతడి స్వగ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అగ్నితేజ్ పేరెంట్స్‌ను అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక, అగ్నితేజ్ పై 153-A, 295-A, 298, 505(2) సెక్షన్ కింద కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment