Lord Ayyappa
-
భైరి నరేష్‌కు మద్దతుగా పోస్టులు.. అగ్నితేజ్ అరెస్ట్
సాక్షి, హన్మకొండ: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓయూ విద్యార్థి భైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, నరేష్ సోదరుడు అగ్నితేజ్.. నరేష్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు చేశాడు. దీంతో, మరోసారి దుమారం చోటుచేసుకుంది. కాగా, ఈ పోస్టు అనంతరం అగ్నితేజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం రాములపల్లికి చెందిన నరేష్ కుటుంబసభ్యుడు అగ్నితేజ్‌ను అరెస్ట్ చేసి మెజీస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు సీఐ సంజీవ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎవరైనా రెచ్చగొట్టే విధంగా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరొకరి మనోభావాలు దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించకూడదని కోరారు. మరోవైపు.. సోషల్ మీడియాలో అగ్నితేజ్ పోస్ట్ కారణంగా అతడి స్వగ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అగ్నితేజ్ పేరెంట్స్‌ను అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక, అగ్నితేజ్ పై 153-A, 295-A, 298, 505(2) సెక్షన్ కింద కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
శబరిమల ఆలయం పేరు మారింది!
-
శబరిమల ఆలయం పేరు మారింది!
దేశ విదేశాల నుంచి ప్రతియేటా లక్షలాది సంఖ్యలో భక్తులు సందర్శించుకునే అయ్యప్ప ఆలయం పేరు మారింది. ఇన్నాళ్లూ శబరిమల శ్రీ ధర్మ శస్త ఆలయం అని ఉన్న ఈ పేరును.. శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం అని మారుస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు సోమవారం ప్రకటించారు. ఆలయం పేరు మార్పుపై పాలక మండలి అయిన ట్రావన్‌కోర్ దేవస్వోం బోర్డు ఉత్తర్వులు కూడా వెలువరించింది. అధికారిక రికార్డులలో ఈ ఆలయం పేరు ఇన్నాళ్లూ శబరిమల శ్రీ ధర్మ శస్త ఆలయం అనే ఉండేది. అక్టోబర్ 5వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఆలయం పేరు మార్చాలన్న నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. దేవస్వోం బోర్డు పరిధిలో చాలా ధర్మశస్త ఆలయాలు ఉన్నాయని, కానీ అయ్యప్పస్వామికి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం శబరిమల మాత్రమేనని, అందుకే ఈ ఆలయాన్ని ఆయన పేరుమీద పెట్టాలని నిర్ణయించామని బోర్డు అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి, ఇంకా దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. సంక్రాంతి సమయంలో జరిగే జ్యోతి దర్శనానికి అయితే భక్తులు వెల్లువెత్తుతారు. -
శబరిమలైలో మకరజ్యోతి దర్శనం
-
శబరిమలైలో మకరజ్యోతి దర్శనం
అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలైకు పోటెత్తారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మకరజ్యోతి దర్శనం కోసం బారులు తీరారు. మంగళవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనభాగ్యం లభించింది. అయ్యప్పల శరణు ఘోషతో శబరిమలై మార్మోగిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలై సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో వచ్చారు. భక్తులకు అసౌకర్యం ఏర్పడినా జ్యోతి దివ్య దర్శనం కోసం ఓపిగ్గా ఎదురు చూశారు. గత రెండు రోజులుగా మొత్తం పదిలక్షల మంది స్వామిని దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. మంగళవారం మరింత భారీ సంఖ్యలో తరలివచ్చారు. మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు నియమ నిష్టలతో దీక్షను ఆచరించి దర్శనానికి వస్తుంటారు. గతేడాదితో పోలిస్తే దేవస్థానం అధికారులు ఈ సారి భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అయినా కొండప్రాంతం కావడంతో భక్తుల సంఖ్యకు తగినట్టు ఏర్పాట్లు చేయడం కష్టతరంగా మారుతోంది. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.