సాక్షి, హైదరాబాద్: కరోనా దేశీయ ‘జాబ్ మార్కెట్’లో గణనీయమైన మార్పులు తెచ్చింది. లాక్‌డౌన్‌లో, ఆ తర్వాత కూడా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువ ఉత్పాదకత రంగాల వైపు మళ్లినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఉత్పత్తి, సర్వీసెస్ (సేవలు) వంటి ఎక్కువస్థాయి కార్మిక ఉత్పాదక కేంద్రాలుగా ఉన్న రంగాల నుంచి వ్యవసాయం, నిర్మాణ రంగం వంటి తక్కువ కార్మిక ఉత్పాదకత రంగాలకు ఉద్యోగ అవకాశాలు మళ్లినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి రంగం ఒక మోస్తరుగానే కోలుకోవడం ఇందుకు కారణమని అంచనా వేసింది. 2020–21లో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఔషధ తయారీ పరిశ్రమలు (ఫార్మాస్యూటికల్స్) మినహా దాదాపుగా అన్ని ప్రధాన తయారీ, ఉత్పత్తి రంగాలు గతేడాదితో పోల్చితే చాలా తక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి.
వ్యవసాయానుకూల పరిస్థితులూ కారణం
లాక్‌డౌన్ కాలంలో వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం.. పరిశ్రమలు, తయారీ, విద్యా, రవాణా, పర్యాటకం వంటి వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల తగ్గుదలను స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితికి గతేడాది మంచి వానలు పడడం, వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం కూడా కారణమని ఈ సంస్థ విశ్లేషించింది. సీఎంఐఈ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వే (కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్ సర్వే) ప్రకారం... గత ఏడాది జూలై, ఆగస్టు నాటికే వ్యవసాయరంగంలో ఉపాధి అవకాశాలు 16 కోట్లకు చేరుకుని సెప్టెంబర్‌లోనూ కొంచెం అటుఇటుగా కొనసాగాయి. ఇది 2019–20తో పోల్చితే 5.5 శాతం అధికం. గత డిసెంబర్‌లో ఈ రంగంలో ఉపాధి 15.4 కోట్లకు తగ్గినా అంతకు ముందు ఏడాదితో పోల్చితే 3.5 శాతం ఎక్కువ. మొత్తంగా చూస్తే 2020లో మొత్తం అన్ని రంగాల ఉపాధి అవకాశాల కల్పనలో వ్యవసాయ రంగం 40 శాతంతో అగ్రభాగాన నిలిచింది. ఇది 2019తో పోల్చితే 4 శాతం అధికం.
విద్యారంగంపై తీవ్ర ప్రభావం
కరోనా తీవ్రత అనంతర పరిస్థితుల్లో కూడా సేవల రంగం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకుని నిలదొక్కుకోకపోవడంతో ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. ప్రధానంగా విద్య, అనుబంధ రంగాలపై కోవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడడంతో సేవల రంగం పూర్తిస్థాయిలో తేరుకోలేదు. 2020 మార్చిలో సేవల రంగంలో 15.7 కోట్ల మంది ఉద్యోగాల్లో ఉండగా, గత డిసెంబర్ నాటికి ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14.8 కోట్లకు తగ్గిపోయింది. గత నెల కల్లా సేవల రంగం బాగానే కోలుకున్నా.. విద్యారంగంలో మాత్రం ఉద్యోగాలు కోల్పోయేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి ఒక్క విద్యారంగంలోనే 91 లక్షల ఉద్యోగాలు పోయాయి. మరోవైపు ›ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉత్పత్తి రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 1.14 కోట్ల మేర తగ్గుదల నమోదైనట్టు సీఎంఐఈ అధ్యయనం వెల్లడించింది. ఈ రంగం కూడా క్రమంగా కోలుకుంటున్నా మొత్తం మీద ఉపాధి అవకాశాలు తగ్గినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment