సాక్షి, హైదరాబాద్: అనేక రాష్ట్రాల్లో బినామీ పేర్ల మీద భూములు, ఇతరత్రా ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేక సంచలనాత్మక అం శాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్ పెద్దలు అనేక సంస్థల పేరిట వేల ఎకరాలు కొనుగోలు చేసి వాటిని మూడోకంటికి తెలియకుండా అమ్మకం సాగిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తుతం సీఐడీ అధికారులు వెలుగులోకి తీసుకువచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా బినామీ కంపెనీల ఆస్తులను జప్తు చేయకుండా ఉండేందుకు గతంలో దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన వారితోపాటు సీనియర్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు దర్యాప్తులో బయటపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి సైతం నివేదిక చేరినట్టు తెలుస్తోంది.
76 ఎకరాలు అటాచ్ చేయకుండా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 76 ఎకరాల అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను అటాచ్ చేయకుండా ఉం డటంతోపాటు మరో 156 ఎకరాల బదలాయింపు పై అగ్రిగోల్డ్ నిందితులు, మ«ధ్యవర్తులు, సీఐడీ అధికారుల మధ్య రూ.3 కోట్ల డీల్ కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సీఐడీలోని కీలక అధికారులకు కోటి రూపాయలు అడ్వాన్స్‌గా ముట్టినట్టుగా తాజా దర్యాప్తులో బయటపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మిగిలిన రూ.2 కోట్ల వ్యవహారంలో మధ్యవర్తులు, అగ్రిగోల్డ్ పెద్దల నడుమ తేడాలు రావడంతో సంబంధిత అధికారులకు ఆ డబ్బు చేరలేదన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీస్ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ జరుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
దర్యాప్తు అధికారుల మార్పు ఇందుకే..!
తాజా పరిణామాలతో అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు అధికారుల మార్పిడికి కారణం ఏమిటో తెలిసిందని అంటున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చే యాల్సింది పోయి, కొంతమంది అధికారులు ము డుపులకు కక్కుర్తి పడి నిందితులతో చేతులు కలిపినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ కారణంగానే దర్యాప్తు అధికారులను మార్చి తాజాగా కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.
అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లు!
బినామీ ఆస్తులను మూడో కంటికి తెలియకుండా చేతులు మార్చిన వ్యవహారంలో అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లుగా ఉన్నారని సీఐడీ గుర్తించింది. బినామీ ఆస్తుల అటాచ్‌మెంట్ వ్యవహారంపై సీఐడీ అధికారులు నిందితులను ఇటీవల విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. బినామీ ఆస్తుల అమ్మకానికి.. కంపెనీలకు ఎలాంటి సంబంధం లేని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో పాటు మాజీ పోలీస్ కానిస్టేబుల్‌ను మధ్యవర్తులుగా పెట్టుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఆయా భూములు అమ్మేందుకు సంబంధిత బినామీ కంపెనీల డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు.
ఈ క్రమంలో 2016లో 76 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు మాజీ కానిస్టేబుల్‌కు సంబంధిత బ్రోకర్ అమ్మేశాడు. ఈ వ్యవహారంపై విచారణ సాగించాల్సిన, ఆ భూములను అటాచ్ చేయాల్సిన అప్పటి సీఐడీ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు తాజా విచారణలో బయటపడింది. అగ్రిగోల్డ్ పెద్దలు జైలు నుంచే సంబంధిత కంపెనీల డైరెక్టర్ల ద్వారా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో మంతనాలు సాగించి 76 ఎకరాల భూమిని అమ్మించినట్టు గుర్తించారు. ఇలాంటి లావాదేవీలు బయటకురాకుండా చేయడంతో పాటు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అప్పటి అధికారులు తొక్కిపెట్టినట్టు ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment