మంత్రి గంగులతో భేటీ అయిన ఎఫ్‌సీఐ జీఎం దీపక్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: రైతుల శ్రేయస్సు దృష్ట్యా అదనపు ఆర్థికభారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరిస్తున్నందున మిల్లింగ్ విషయంలో ఎఫ్‌సీఐ అనవసర కొర్రీ లు పెట్టొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యాసంగి ధాన్యం సేకరణ నేపథ్యంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులతో కలసి ధాన్యం సేకరణ, సీఎంఆర్, గోడౌన్ సమస్యలపై చర్చించారు.
యాసంగిలో తెలంగాణలో పండే ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా ఉం టుందనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. నూక శాతం పెరగడం వల్ల ఎదురయ్యే అదనపు భారాన్ని భరించి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ముడి బియ్యం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. నాణ్యతాప్రమాణాల మేరకు ముడిబియ్యం అందిస్తామని కేంద్రానికి, ఎఫ్‌సీఐకి లేఖలు రాసినట్లు చెప్పారు. గత యాసంగికి సంబంధించి ఎఫ్‌సీఐ సేకరించాల్సిన 5.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ‘ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్’రూపంలో తీసుకోవాలని సూచించారు.
వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని వేగంగా అందించేలా రైల్వే ర్యాకులు, అదనపు స్టోరేజీ కల్పించాలని కోరారు. ధాన్యం తక్కువ సేకరించే రాష్ట్రాలకు, అధి కంగా సేకరించే తెలంగాణకు సీఎంఆర్‌లో ఒకే గడువు ఇస్తున్నారని, ఈ అసమగ్ర విధానాన్ని పున:సమీక్షించాలని దీపక్ శర్మను కోరారు. ఈ యాసంగిలో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నామని చెప్పారు. ఇందుకోసం 15 కోట్ల గన్నీ సంచులు అవసరమని, వీటి కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఎఫ్‌సీఐ నుంచి డీజీఎం కమలాకర్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడల్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు చెప్పారు.
పక్క రాష్ట్రాల ధాన్యాన్ని అడ్డుకోవాలి
ఎఫ్‌సీఐ జీఎంతో సమావేశం అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి కమలాకర్ సమీక్షించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు కేంద్రాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం విజిలెన్స్ టీం పక్కా ప్రణాళికలతో ఈ రెండు నెలలు క్షేత్రస్థాయిలో నిరంత రం పర్యవేక్షించాలన్నారు.
రీసైక్లింగ్ బియ్యం రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని, వస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతరం ధాన్యం సేకరణలో ఉన్న ఆర్థికపరమైన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో బీఆర్కే భవన్‌లో భేటీ అయ్యారు. రుణాలపై రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, గత బకాయిలు వంటి అంశాలను చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment