ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్‌ను.. చిక్కడపల్లి పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తొలుత పుష్ప హీరోను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి స్టేట్‌మెంట్ రికార్డుచేసి.. అటుపై వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి.. అటు నుంచి అటు రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. అయితే..
ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఈ కేసు అంత తీవ్రమైందా?.. ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షల గురించి ఓసారి పరిశీలిద్దాం..
👉105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఉద్దేశపూర్వకంగా చంపేందుకు.. ఉద్దేశం లేకపోయినా అది మరణానికి దారి తీస్తుందని తెలిసిగానీ చేసే నేరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఇది హత్యానేరం(Murder) కిందకు రాకపోయినప్పటికీ.. శిక్షించదగిన హత్యానేరమే అవుతుంది.
👉105 సెక్షన్ కింద.. ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే మినిమమ్ ఐదేళ్లు.. గరిష్టంగా పదేళ్ల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు.
👉105 సెక్షన్ ప్రకారం.. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ తెలిసికూడా మరణానికి గనుక కారణమైతే.. ఆ శిక్షకుగానూ గరిష్టంగా పదేళ్ల శిక్ష, జరిమానా విధిస్తారు.
👉సెక్షన్ 118(1).. ప్రమాదకరమైన ఆయుధాలు లేదంటే ఇతరత్రా మార్గల ద్వారా గాయపర్చడం. ఈ నేరం తీవ్ర దృష్ట్యా మూడేళ్ల వరకు జైలు శిక్ష.. రూ.20వేల జరిమానా విధిస్తారు.
అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి
దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన భాస్కర్ మాగుడంపల్లి(మృతురాలు రేవతి భర్త) ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సంధ్యా 70 ఎంఎం థియేటర్ మేనేజ్‌మెంట్, స్టాఫ్‌తో పాటు అల్లు అర్జున్, ఆయన పర్సనల్ భద్రతా సిబ్బందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించగా.. అల్లు అర్జున్ పేరు 11వ నిందితుడిగా చేర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
కాగ్నిజబుల్ నేరం . అంటే ఒక పోలీసు అధికారికి వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, కోర్టు అనుమతితో లేకుండా విచారణ జరిపే అధికారం ఉన్న నేరమన్నమాట. నేరం తీవ్రత దృష్ట్యా ఇది అన్వయింపజేస్తారు. తాజాగా.. కాగ్నిజబుల్ నేరం కిందనే వారెంట్ లేకుండానే అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.
సెక్షన్ 118(1) విత్ సెక్షన్ 3(5).. సెక్షన్ 118(1)కు సెక్షన్ 3(సబ్ సెక్షన్-5)నుకూడా పోలీసులు జత చేశారు. ఈ సెక్షన్ కింద.. ఒక నేరంలో ఎక్కువ మందికి గనుక భాగం ఉంటే.. వాళ్లందరికీ సమానంగా బాధ్యత ఉంటుందని అర్థం.
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 304, సెక్షన్ 324, సెక్షన్ 34ను.. బీఎన్‌ఎస్‌లో 105, 118(1), 3(5) సెక్షన్‌లతో భర్తీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment