థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలన్నీ నూరు శాతం అబద్ధాలే
మానవత్వంలేని మనిషిగా నన్ను చిత్రీకరించడం బాధించింది
రోడ్ షో, ర్యాలీగా వెళ్లాననడం దారుణం.. అనుమతి లేకుంటే పోలీసులు వెనక్కి పంపేవారుగా?
చిరంజీవి, ఇతర హీరోల అభిమానులు మరణించినప్పుడు పరామర్శించా
నా అభిమాని మరణిస్తే పరామర్శించాలని నాకు ఉండదా?
లీగల్‌గా ఇబ్బంది అవుతుందనే శ్రీతేజ్‌ను పరామర్శించలేకపోయా..
15 రోజులుగా బాధలో ఉన్నా.. పుష్ప–2 విజయోత్సవాలు రద్దు చేసుకున్నా
సీఎం విమర్శల నేపథ్యంలో విలేకరుల సమావేశంలో హీరో అల్లు అర్జున్
బంజారాహిల్స్: పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తాను నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వస్తున్న ఆరోపణలను హీరో అల్లు అర్జున్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధాలేనని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న దుష్ప్రచారంగా అభివర్ణించారు.
పోలీసుల అనుమతి లేకుండానే తాను థియేటర్‌కు వెళ్లినట్లు, తొక్కిసలాట అనంతరం పోలీసుల సూచనలు పెడచెవిన పెట్టినట్లు కొంత మంది చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తనను మానవత్వంలేని మనిషిగా చిత్రీకరించడం బాధించిందన్నారు. సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శల నేపథ్యంలో శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడారు. తాజా పరిణామాలపై వివరణ ఇచ్చారు.
థియేటర్ నాకు గుడిలాంటిది..
‘సినిమా థియేటర్ నాకు గుడి లాంటిది. అక్కడ ప్రమాదం జరగడం నాకు చాలా బాధగా ఉంది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ ఘటన తర్వాత నిర్మాత బన్నీ వాసు వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడారు. నేను కూడా వస్తానంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారించారు. నాపై పోలీసులు కేసు నమోదు చేసినందున బాధిత కుటుంబాన్ని కలిస్తే చట్టపరంగా తప్పుడు సంకేతాలు వస్తాయని లీగల్ టీం సైతం గట్టిగా చెప్పడం వల్లే అక్కడికి వెళ్లలేకపోయా’అని అల్లు అర్జున్ తెలిపారు.
నా అభిమాని చనిపోతే వెళ్లాలని నాకు ఉండదా?
తొక్కిసలాట ఘటనలో ఒకరి మృతితో 15 రోజులుగా బాధలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పారు. ఈ నేపథ్యంలో సినిమా విజయోత్సవాలను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘గతంలో మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు హీరోల అభిమానులు చనిపోతే విజయవాడ, వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లి పరామర్శించా. అలాంటిది నా అభిమాని చనిపోతే వెళ్లనా? పరామర్శించాలని నాకు ఉండదా?’అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఘటన జరిగిన మర్నాడే బాధిత కుటుంబాన్ని కలవాలనుకున్నప్పటికీ తన లీగల్ టీం సూచనల వల్ల వెళ్లలేకపోయానన్నారు.
అనుమతి లేకపోతే పోలీసులు వెనక్కి పంపేవారు కదా..
థియేటర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనను అత్యంత దురదృష్టకరమైన ప్రమాదంగా హీరో అల్లు అర్జున్ అభివర్ణించారు. సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు పోలిసులు అక్కడ ఉన్నారని... దాంతో తన రాకకు అనుమతి ఉందనే భావించినట్లు ఆయన చెప్పారు. తాను లోపలికి వెళ్లేందుకు వీలుగా తన వాహనాలకు దారి చూపింది పోలిసులేనని.. ఒకవేళ తన రాకకు పోలీసుల అనుమతి లేకుంటే వారు అప్పుడే వెనక్కి పంపేవారు కదా? అని అల్లు అర్జున్ ప్రశ్నించారు.
రోడ్ షో అనడం దారుణం
థియేటర్‌కు రోడ్ షో, ర్యాలీ చేసుకుంటూ వెళ్లాననే మాట పూర్తిగా అవాస్తవం, దారుణమని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. థియేటర్‌కు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉండగా భారీ సంఖ్యలో అభిమానులు తన వాహనాన్ని చుట్టుముట్టారని చెప్పారు. తాను కారులో నుంచి పైకి వచ్చి అభివాదం చేస్తే అభిమానులు పక్కకు జరుగుతారని అక్కడి వారు చెబితే తాను బయటకు వచ్చానని వివరించారు. తనను ఒక్కసారైనా చూసేందుకు అంత మంది అభిమానులు వచ్చినప్పుడు తాను కారులోనే కూర్చుంటే తనకు తల పొగరు అనుకుంటారని భావించే వారికి నమస్కరిస్తూ దారివ్వాలని కోరానన్నారు.
మహిళ మృతి గురించి పోలీసులు చెప్పలేదు..
తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని పోలిసులు తనకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పారు. కేవలం థియేటర్ యాజమాన్యం తన వద్దకు వచ్చి బయట గొడవగా ఉన్నందున వెళ్లిపోవాలని సూచించారన్నారు. దీంతో వెంటనే తాను భార్యతో కలిసి బయటకు వెళ్లిపోయానని వివరించారు. తన పిల్లల్ని లోపలే వదిలి వెళ్లానని.. ఒకవేళ జరిగిన దుర్ఘటన గురించి తెలిస్తే వారిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తానని ప్రశ్నించారు. ఈ విషయం మరుసటి రోజు ఉదయం తెలిసి షాక్‌కు గురయ్యానన్నారు.
ఆ తర్వాత బాధిత కుటుంబానికి అండగా ఉన్నాననే విషయాన్ని తెలియజేసేందుకే వీడియో విడుదల చేశానన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని తెలియడం ఒక్కటే ప్రస్తుతం తనకు ఊరట కలిగించే అంశమన్నారు. తాను వెళ్లడం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతోనే తన తండ్రి అల్లు అరవింద్‌ను ప్రత్యేక అనుమతి ద్వారా ఆస్పత్రికి పంపి బాలుడి చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అల్లు అర్జున్ వివరించారు. తాను, దర్శకుడు సుకుమార్ కలిసి పిల్లల భవిష్యత్తు కోసం కచ్చితంగా ఏదైనా మంచి పని చేయాలని అవసరమైతే వారి పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయాలని చర్చించుకున్నట్లు చెప్పారు.
ఎవరినీ నిందించట్లేదు..
తాను ఎవరినీ నిందించాలని మాట్లాడటం లేదని.. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపం లేదని అల్లు అర్జున్ చెప్పారు. ప్రభుత్వం తమ సినిమాకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించిందని.. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అదే సమయంలో తనను మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించే పరిస్థితి ఎదురవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. కేసు విచారణ దశలో ఉన్నందున మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
మా కుటుంబం గురించి అందరికీ తెలుసు: అల్లు అరవింద్
పాన్ ఇండియా మూవీగా వచ్చిన సినిమాను ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూసుకుందామనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లాడని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. థియేటర్ వద్ద ఘటన తర్వాత మనస్తాపానికి గురై అదే ఆలోచనలతో ఉండిపోయాడన్నారు. మూడు తరాల చరిత్రగల తమ కుటుంబం గురించి అందరికీ తెలుసన్నారు. అసత్య ప్రచారాల వల్ల బాధలో ఉన్నందున మనసులోని ఆవేదనను చెప్పుకుంటున్నామన్నారు. ప్రజలు ఆదరిస్తేనే ఈ స్థాయికి వచ్చామని.. అభిమానాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment