నాట్యవిలాసం.. | Amazing dance performance in Rabindra Bharathi | Sakshi
Sakshi News home page

నాట్యవిలాసం..

Published Wed, Jul 17 2024 9:28 AM | Last Updated on Wed, Jul 17 2024 9:28 AM

Amazing dance performance in Rabindra Bharathi

రవీంద్ర భారతిలో అద్భుత నాట్య ప్రదర్శన 
ఆహూతులను ఆకట్టుకున్న నృత్య రీతులు 
ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేం: ఇంద్రాణీ సుగుమార్‌
 ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాం
 మలేసియా నాట్యబృందంతో ‘సాక్షి’ ప్రత్యేక సంభాషణ 

సాక్షి, సిటీబ్యూరో/గన్‌ఫౌండ్రీ: నెమలి నాట్యం ఎంత అందంగా ఉంటుందో.. వాళ్లు నృత్యం చేస్తే అంతకన్నా అద్భుతంగా ఉంటుంది. ఆ నెమలి సైతం అబ్బురపడేలా వారి ప్రదర్శన ఉంటుంది. అమ్మవారి వేషం వేసుకుంటే అమ్మవారే పూనినట్టు అనిపిస్తుంది. రాక్షస సంహార ఘట్టం ప్రదర్శన చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాల్సిందే. సాక్షాత్తూ అమ్మవారే భువి నుంచి దివికి దిగి వచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఇటీవల మలేసియా నుంచి హైదరాబాద్‌ వచ్చి పలు నృత్య రూపకాలను రవీంద్రభారతిలో ప్రదర్శించిన నాట్య బృందాన్ని ‘సాక్షి’పలకరించింది. ఇక్కడ వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకుంది. 

కళ్లు చెమర్చాయి... 
రవీంద్ర భారతిలో మలేసియా సంప్రదాయ నృత్యమైన నెమలి నృత్యం, కళింగ అమ్మాళ్‌ నృత్య రూపకాలను ప్రదర్శించామని బృందానికి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్‌ ఇంద్రాణీ సుగుమార్‌ వివరించారు. మొత్తం పది మంది బృందంతో ఇచి్చన అమ్మాళ్‌ నృత్య ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచి్చందని తెలిపారు. రాక్షస సంహారం అనంతరం ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పారు. అనేక దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చామని, ఇలాంటి స్పందన ఎక్కడా చూడలేదని, ఇక్కడివారి ప్రేమాభిమానాలకు మంత్ర ముగ్ధులమయ్యామని చెప్పారు. ఇక లైటింగ్, సౌండ్‌సిస్టమ్‌తో ప్రదర్శన చేస్తుంటే రోమాలు నిక్కబొడిచాయని, అంత అద్భుతంగా స్టేజీని అలంకరించారని చెప్పారు. ప్రదర్శన అనంతరం అమ్మవారి వేషధారణలో ఉన్న తమకు కొందరు నమస్కరించారని గుర్తు చేసుకున్నారు.  

ఆడవాళ్లకు చాలా సురక్షితమైన ప్రాంతం 
మహిళలకు హైదరాబాద్‌ ఎంతో సురక్షిత ప్రాంతంగా అనిపించిందని చెప్పారు. నిర్వాహకులు తమను ఎంతో బాగా చూసుకున్నారన్నారు. ఇక్కడి ఆతిథ్యం ఎంతో బాగుందని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. తొలిసారి హైదరాబాద్‌లో నృత్య ప్రదర్శన ఇచ్చామని, మరోసారి అవకాశం వస్తే ప్రదర్శన చేయాలని ఉందని చెప్పారు.  

హైదరాబాద్‌ బిర్యానీ బాగుంది.. 
చార్మినార్‌ను సందర్శించామని, ఇక, హైదరాబాద్‌ బిర్యానీ ఎంతో రుచికరంగా ఉందని, అక్కడికి వెళ్లాక చాలా మిస్‌ అవుతామన్నారు. ఇరానీ చాయ్‌ కూడా టేస్టీగా ఉందని చెప్పారు. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని వివరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ఎంతో మర్యాదగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారని తెలిపారు.

దేశవిదేశాల్లో ప్రదర్శనలు.. 
ఏపీలోని వైజాగ్‌తో పాటు తమిళనాడులోని చిదంబరం దేవాలయం, పుదుచ్చేరిలో ప్రదర్శనలు ఇచ్చామని, చిదంబరంలో 2019లో తాము ప్రదర్శించిన చిదంబరేశ నాట్య కలైమణి ప్రదర్శన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ‘కల్చరల్‌ ఎక్సే్చంజ్‌ ప్రోగ్రామ్‌’ కింద అనేక ప్రదర్శనలు ఇచ్చామని తెలిపారు. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, మారిషస్‌లోని అనేక ప్రాంతాల్లో నృత్య ప్రదర్శన చేస్తుంటామని చెప్పారు. ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా తాము ప్రదర్శనలు ఇస్తుంటామని తెలిపారు. మలేసియాలోని కౌలాలంపూర్‌ వద్ద ఇంద్రాణీ డ్యాన్స్‌ అకాడమీ నెలకొల్పి, ఆసక్తి ఉన్న వారికి నృత్యం నేరి్పస్తానని తెలిపారు. భరత నాట్యంలో తాను నిష్ణాతురాలినని, అయితే భరత నాట్యంతో పాటు ఒడిస్సీ కూడా విద్యార్థులకు 
నేరి్పస్తానని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement