సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి(26) సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ పై సస్పెన్సన్‌ను ఎత్తేశారు. హైకోర్టు ఆదేశంతో సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ ప్రకటించారు. దీంతో.. తరగతులకు హాజరు అయ్యేందుకు సైఫ్‌కు అనుమతి లభించినట్లయ్యింది.
డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే.. ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 22 న ఎంజీఎంలో ఆమె ఆత్మహత్యా యత్నం చేయగా.. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. మరోవైపు ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు, కళాశాల ప్రిన్సిపల్ కు పిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద కేసు నమోదు చేసి సైఫ్ ను రిమాండ్ తరలించిన పోలీసులు.
మరోవైపు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ కేసు తీవ్రంగా పరిగణించింది. ఏడాదిపాటు సైఫ్ తరగతులకు హాజరు కాకుండా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో.. బెయిల్పై సైఫ్ ఈ విడుదల అయ్యాడు కూడా. అయితే.. తన నుంచి వివరణ తీసుకోకుండానే కాలేజీ తనపై సస్పెన్షన్ వేటు వేసిందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు సైఫ్. ఈ క్రమంలోనే.. సైఫ్ వివరణ తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు.
అయితే.. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని గత శుక్రవారం సైఫ్ కు నోటీస్ ఇచ్చారు కేఎంసీ ప్రిన్సిపాల్. కానీ, ఆ సమావేశానికి సైఫ్ హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్. అయితే.. ప్రస్తుతానికి సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేసి సైఫ్‌ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత అతని వివరణ తీసుకోవాలని.. ఆపై యాంటీ ర్యాగింగ్ కమిటీదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఆదేశాల మేరకు సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కేఎంసీ ప్రిన్సిపాల్.
Comments
Please login to add a commentAdd a comment