పరేడ్ గ్రౌండ్స్ సభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విమోచన పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు భయమెందుకని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విమోచన దినోత్సవ నిర్వహణకు సిగ్గు, మొహమాటం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో, ఉద్యమంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రజాకార్ల భయంతో వెనక్కు తగ్గారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించి 75 ఏళ్లు కావొస్తున్నా ఓటుబ్యాంక్ రాజకీయాలతో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అధికారికంగా నిర్వహించే సాహసం చేయలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై అమిత్‌షా ప్రసంగించారు. ‘ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించగానే అందరూ దీనిని నిర్వహించేందుకు సిద్ధపడినా విమోచన పేరుతో జరిపేందుకు భయపడుతున్నారు. రజాకార్లు ఇంకా దేశానికి సంబంధించిన నిర్ణయాలేవీ తీసుకోలేరు. అందువల్ల వారంతా తమ మనస్సు ల్లోని భయాన్ని తొలగించాలి. ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాల నేది ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష. దీన్ని సాకారం చేసే లక్ష్యంతోనే కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరు నిర్వహించినా నిర్వహించకపోయినా కేంద్రం అధికారికంగా ప్రతి ఏటా ఘనంగా ఈ దినోత్సవాలను నిర్వహిస్తుంది’ అని అమిత్‌షా చెప్పారు.
శనివారం పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సాయుధ బలగాలనుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
నవతరానికి స్ఫూర్తినిచ్చేందుకే...
హైదరాబాద్ విమోచన కోసం త్యాగం చేసిన యోధులు, అమరు లను ప్రజల్లో పునరుజ్జీవులుగా ఉంచడంతోపాటు నవ, యువ తరానికి స్ఫూర్తి కలిగించడానికే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నా మని అమిత్‌షా చెప్పారు. ఎందరో వీరులు నిజాం అరాచకా లను, అత్యాచారాలను సహించిన విషయాన్ని నేటి తరం మరిచి పోవద్దన్నారు. పాత హైదరాబాద్ స్టేట్ (3 రాష్ట్రాల పరిధిలో) లోని విశ్వవిద్యాలయాల్లో ఈ అంశంపై లోతైన పరిశోధనలు, అధ్యయనాలు జరగాలన్నారు. ఆ వీరుల గాథను దేశం నలు మూలలా చేరవేసి నివాళులు అర్పించాలని చెప్పారు. తెలంగాణ విమోచనం చెందిన 74 ఏళ్ల తర్వాత అధికారికంగా ఈసారి కార్య క్రమాలు నిర్వహించడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
పటేల్‌దే నిర్ణయాత్మక పాత్ర..
తెలంగాణకు స్వాతంత్య్రం తీసుకురావడంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ పోషించిన పాత్రను అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘హైదరాబాద్ స్టేట్‌లో నిజాం నవాబును, రజాకార్లను ఓడించకపోతే అఖండ భారత్ స్వప్నం నిజం కాదని పటేల్ గ్రహించారు. దేశం మధ్యలోని కొంత భాగంలో అకృత్యాలు, అత్యాచారాలు, హింస కొనసాగుతుంటే మహాత్మాగాంధీ స్వతంత్ర భారత స్వప్నం పూర్తి కాదనే పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా విజయం సాధించారు. పటేల్ లేకపోతే ఈ ప్రాంతం మరిన్ని రోజులు చీకట్లోనే ఉండేది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కొమురం భీం, రాంజీ గొండు, స్వామి రామానంద తీర్థ, విద్యాధర్ గురూజీ, పండిత్ కేశవరావ్ కోరట్ కర్, ఎం.చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, వందేమాతరం రామచంద్రరావు, నారాయణ్ రావ్ పవార్ మొదలైన వారిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ స్టేట్‌లో నిజాం, రజాకార్ల నికృష్టచర్యలను ఉద్యమకారులు గట్టిగా ఎదుర్కొన్నారని చెప్పారు. గుండ్రాంపల్లిలో తన పర్యటన సందర్భంగా స్థానికులు అక్కడ నిజాం సమయంలో జరిగిన ఆకత్యాల గురించి చెప్పడం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆ ఘటనను దక్షిణ భారత జలియన్ వాలాబాగ్‌గా అభివర్ణించిన విషయాన్నీ అమిత్ షా గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా జరుపుకునే వాతావరణాన్ని కల్పించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని అభినందించారు.
కంటోన్మెంట్‌లో జరిగిన కార్యక్రమంలో
మానసిక దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న అమిత్ షా.
ఘనంగా విమోచన దినోత్సవం
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్న వాతావరణంలో సాగింది. అమిత్‌షా తొలుత జాతీయ పతాకాన్ని ఎగరవేసి, కేంద్ర సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరేడ్‌గ్రౌండ్స్‌లో 1948 సెప్టెంబర్ 17 తరువాత 75 ఏళ్లకు అదే రోజు తిరిగి జాతీయ జెండా ఎగిరిందంటూ అమిత్‌షాను అభినవ వల్లభాయి పటేల్‌గా కీర్తించారు. కాగా, అమిత్ షా బేగంపేటలోని హరితప్లాజాకు వచ్చే ముందు అక్కడి ప్రవేశద్వారంలో ఓ కారు అకస్మాత్తుగా ఆగడంతో కలకలం రేగింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆ ప్లాజాలోని రెస్టారెంట్‌కు వచ్చే క్రమంలో ఆయన కారు నిలిచిపోయింది. అమిత్‌షా కోసం రూట్ క్లియరెన్స్ చేస్తున్న పోలీసులు కారును ముందుకు నెట్టే ప్రయత్నంలో కారు అద్దాలు పగిలాయి. కారు ఆగడం వెనుక ఎలాంటి దురేద్దేశాలు లేవని తేలడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అమిత్ షాకు పటేల్ ప్రతిమను బహూకరిస్తున్న బండి
ఇదీ చదవండి: ‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు
Comments
Please login to add a commentAdd a comment