జూలై చివరినాటికి మార్చాలని సీఎస్ శాంతికుమారి ఆదేశం
ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధం, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించాలి
పంచాయతీరాజ్, అటవీశాఖ, పీసీబీ అధికారులతో సీఎస్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను జూలై ఆఖరులోగా పూర్తి ప్లాస్టిక్ రహిత జోన్‌గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎస్ మాట్లాడారు.
కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తరాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. టైగర్ రిజర్వ్‌లో ప్లాస్టిక్ నిషేధం గురించి హైవే వెంట ఉన్న స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించాలని చెప్పారు.
ఈ రిజర్వ్ పరిధిలోని నాలుగు ఆవాసాల్లో నివాసముంటున్న ప్రజలను తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హరిత నిధి కింద ఉన్న నిధులను సంబంధిత ఆర్థిక సంవత్సరంలోనే వినియోగించుకోవాలని సూచించారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాలోని మైసమ్మ ఆలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులకు చెప్పారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పీసీబీ సభ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత రావు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment