ఎమ్మెల్యే అరికెపూడి గాందీ,ఆయన అనుచరుల వీరంగం
ఇంటి అద్దాలు పగలగొట్టి.. రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద కుర్చీవేసుకుని కూర్చున్న అరికెపూడి
‘నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటికి రా..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు
పీఏసీ చైర్మన్ పదవి, ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య వాగ్యుద్ధం
గాంధీ ఇంటికెళ్లి పార్టీ కండువా వేస్తానన్న కౌశిక్.. అడ్డుకున్న పోలీసులు
ఆపై అనుచరులతో కౌశిక్ నివాసానికి వెళ్లి విధ్వంసం సృష్టించిన గాంధీ
భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు
గాందీ, ఆయన అనుచరులపై ఫిర్యాదు కోసం సైబరాబాద్ సీపీ ఆఫీసుకు హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
సీపీ ఆఫీసులోకి అనుమతి నిరాకరణ.. పోలీసులు, కౌశిక్‌రెడ్డి మధ్య వాగ్వాదం
అక్కడే బీఆర్‌ఎస్ నేతల బైఠాయింపు.. అరెస్టు చేసి శంషాబాద్‌కు తరలింపు
చినికి చినికి గాలివానలా మారిన అరికెపూడికి పీఏసీ చైర్మన్ పదవి వివాదం
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, ఆయన అనుచరులు దాడికి దిగారు. గాంధీ స్వయంగా కౌశిక్‌రెడ్డి నివాసంవైపు దూసుకురాగా.. అనుచరులు ఇంట్లోకి వెళ్లి అద్దాలు, పూల కుండీలు పగలకొట్టడంతోపాటు రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కుర్చీలు విసురుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. పాడి కౌశిక్‌రెడ్డి, ఆయన భార్య, కూతురు, కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే.. సుమారు గంట పాటు వీరంగం సృష్టించారు.
అరికెపూడి ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి ఇంటి ముందే కుర్చీ వేసుకుని ‘నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటికి రా..నా కొడకా’ అంటూ తీవ్ర పదజాలంలో సవాల్ చేశారు. దీనితో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కౌశిక్ నివాసానికి చేరుకోవడంతో.. పోలీసులు ఎమ్మె ల్యే గాం«దీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. గాందీపై, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్‌రెడ్డి, హరీశ్, ఇతర నేతలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లగా.. హరీశ్‌రావును, ఇతర ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకుంటున్న కౌశిక్‌రెడ్డి మామ కృష్ణారెడ్డి.. ఈ దాడితో ఆందోళన చెంది, అస్వస్థతకు లోనయ్యారు.
అసలు ఎలా మొదలైంది?
అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని నియమించడంతో వివాదం రేగింది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని బుధవారం అరికెపూడి గాంధీ చెప్పడం.. ఎమ్మెల్యే గాంధీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్న పక్షంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పి, ఆయన ఇంటిపై బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించడం.. అగ్నికి ఆజ్యం పోశాయి.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం ఉన్న ‘కొల్లూరు లక్సూరియా’ నివాస సముదాయం వద్ద పోలీసులు మోహరించారు. గాంధీ ఇంటికి వెళ్లేందుకంటూ బయటికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు వాహనం కూడా సిద్ధం చేశారు. ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్న పక్షంలో ఆయనను శుక్రవారం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ప్రకటించారు.
మరోవైపు కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అరికెపూడి.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తానే కౌశిక్ ఇంటికి వెళతానని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ తన ఇంటికి వస్తే పార్టీ కండువా, మంగళ హారతులతో స్వాగతం పలుకుతానని కౌశిక్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ మహిళా విభాగం నేత పావని గౌడ్, మరికొందరు మహిళలు మంగళహారతులతో సిద్ధమయ్యారు.
భారీగా అనుచరులను వెంటబెట్టుకుని వచ్చి..
ఇక ఎమ్మెల్యే గాంధీ నివాసానికి వస్తానని కౌశిక్‌రెడ్డి చేసిన ప్రకటనతో గురువారం ఉదయం నుంచే కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీలోని గాంధీ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పలువురు కార్పొరేటర్లు, అనుచరులు గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలలోపు కౌశిక్‌రెడ్డి తన రాకపోతే.. తానే కౌశిక్ నివాసానికి వెళ్తానని అరికెపూడి గాంధీ ప్రకటించారు.
12 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో భారీ కాన్వాయ్‌గా కౌశిక్ నివాసానికి బయలుదేరారు. పోలీసులు కౌశిక్‌రెడ్డి ఉంటున్న నివాస సముదాయం గేట్లు మూసేసినా.. గాంధీ అనుచరులు పైనుంచి లోనికి దూకారు. గేట్లు తెరుచుకుని కౌశిక్ ఇంటివైపు దూసుకెళ్లారు. అప్పటికే కౌశిక్‌రెడ్డి అనుచరులు కూడా అక్కడ ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో గాంధీ అనుచరులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.
కౌశిక్ నివాసానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
దాడి విషయం తెలిసిన బీఆర్‌ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కౌశిక్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, బిగాల గణేశ్‌గుప్తా, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్ సాగర్, కొలన్ బాల్‌రెడ్డి తదితరులు కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు. కౌశిక్ నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటన తీరును వివరించారు. కౌశిక్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఫోన్‌లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు.
నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డమీద కూర్చొని నువ్వు సవాల్ చేస్తే భయపడతామనుకున్నవా.. బిడ్డా! నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలిరావాలి. నీకు 65 ఏండ్లు, నాకు 35 ఏళ్లు.. నా ఇంటిపై దాడి చేయిస్తవా. సరే చూసుకుందాం. రేపు నా తడాఖా ఏంటో చూపిస్తా. గాంధీ చర్యకు ప్రతి చర్య ఉండటం ఖాయం.
– హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
పార్టీని భ్రషు్టపట్టించిన బ్రోకర్ నా కొడుకు కౌశిక్‌రెడ్డి. చీటర్, బ్రోకర్, కోవర్టు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను గౌరవిస్తా. కౌశిక్ లాంటివారే కేసీఆర్ చుట్టూ చేరి పార్టీకి తీవ్ర నష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్లను దూరం పెట్టినపుడే బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరిస్తారు. కౌశిక్ నా ఇంటికి వస్తానని చెప్పి దాక్కున్నాడు. కొడకా నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా..
– శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
Comments
Please login to add a commentAdd a comment