సామాజిక న్యాయంతో స్థిరంగా కొనసాగే సమాజాన్ని స్వప్నించిన ఈ దార్శనికుడికి ప్రకృతి పైన, సమానత్వం పైన ఎనలేని విశ్వాసం. ప్రతి మనిషీ.. అతడు వికలాంగుడైనా, కుష్టురోగి అయినా వారికి ఒక శక్తినిచ్చే వనరుగా కనిపిస్తారు బాబా ఆమ్టే. ‘‘ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఉదాత్తతను వర్షించే వారే యువత’’ అన్నది బాబా నిర్వచనం. ఆ లక్షణమే ఆయనను వికసిస్తున్న నవతరంతో సాధ్యమైనంత అనుబంధాన్ని పెంచుకోగలిగేలా చేసింది. సోమనాథ్ క్యాంప్‌లో చంద్రాపూర్ వద్ద కుష్టు రోగుల కోసం ఆయన ఏర్పాటు చేసిన ఆనందవన్ ఆశ్రమం యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తోంది.
అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఆయన నెలకొల్పిన హేమల్ కాసా అనే ఆదివాసీల కేంద్రం చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలుగా రూపాంతరం చెందుతాయనడానికి చక్కని నిదర్శనం. మురళీధర్ దేవదాస్ ఆమ్టే వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన మహాత్మాగాంధీ, వినోబా భావేల సిద్ధాంతాలతో పాటు మానవతావాదాన్ని స్థిరంగా విశ్వసించారు. అంతకుమించి ఆయన ఆ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టగల విశిష్ట సామర్థ్యం గల వ్యక్తి. కేవలం మాటలకు పరిమితం కాని ఆచరణ పట్ల ఆయనకున్న అచంచల విశ్వాసానికి ప్రతిరూపమే ఆయన ఉద్యమం.
పంజాబ్‌లో హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు; ముంబైలో, భాగల్పూర్‌లో అల్లర్లు చెలరేగినప్పుడు ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. బాధితుల తరఫున పోరాటం సాగించారు. భారత్ జోడో అంటూ ఆయన ఇచ్చిన పిలుపు లక్షలాది హృదయాలను కదిలించింది. మానవ జాతిని ముక్కలు చేసే దురాలోచనలను ఎదుర్కొనేందుకు ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో, నిజాయితీగా పిలుపునివ్వడమే అందుకు కారణం. ఆయన వైయక్తిక విషయాల పట్ల కూడా శ్రద్ధ చూపేవారు. తన భార్యను ప్రేమించడమే కాదు, గౌరవించారు. ఆయన కుమారులు వికాస్, ప్రకాష్, కూతుళ్లు, మనవలు అందరూ ఆయన ధార్మిక కృషిలో భాగస్థులైన వారే.
(చదవండి: శతమానం భారతి: లక్ష్యం 2047 మహిళాశక్తి)
Comments
Please login to add a commentAdd a comment