సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన వెంటిలేటర్‌పై ఉన్న ఓ గర్భిణీకి మాతృత్వాన్ని ప్రసాదించడంతో పాటు, నెలలు నిండకముందే పుట్టి కరోనా బారిన పడిన ఆ బిడ్డకు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ డాక్టర్లు ఊపిరి పోసి తల్లి ఒడికి చేర్చారు. దీంతో హైదరాబాద్ నగరంలోనే అతి పిన్న వయస్సులో కరోనాను గెలిచిన పాపగా ఆ నవజాత శిశువు రికార్డు సాధించినట్లయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 వారాల గర్భిణీ కరోనా సోకి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా ఏప్రిల్ 17న నెలలు నిండని 1,000 గ్రాముల బరువుతో కూడిన నవజాత శిశువుకు ఆమె జన్మనిచ్చింది.
మొదట నెగెటివ్.. తర్వాత పాజిటివ్
పుట్టిన శిశువుకు కోవిడ్ టెస్ట్ చేయగా తొలుత నెగెటివ్ వచ్చింది. వారం తర్వాత క్రమంగా శిశువు ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టమై వెంటిలేటర్ అవసరం ఏర్పడింది. దీంతో మరోసారి కరోనా టెస్ట్ చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో శిశువు బరువు 1,000 గ్రాముల నుంచి 920 గ్రాములకు తగ్గిపోయింది. ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటంతో ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్, నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి.అపర్ణ ఆధ్వర్యంలో వైద్య బృందం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించడానికి కోవిడ్ ఐసోలేషన్ ఐసీయూకు తరలించారు. ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్ ఇస్తూ ఆధునిక పద్ధతులలో చికిత్స చేశారు.
శిశువు క్రమంగా కోలుకోవడంతో మరోసారి డాక్టర్లు పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా కోవిడ్ నెగటివ్ రావడంతో శిశువును ఐసీయూ నుంచి చక్కని వెలుతురు, సరైన ఊష్ణోగ్రత కూడిన ప్రత్యేకమైన గదిలోకి మార్చి చికిత్స చేశారు. ఆస్పత్రిలో దాదాపు 30 రోజులు అన్ని రకాల మెరుగైన చికిత్సలతో శిశువు 1,500 గ్రాముల బరువుకు చేరుకోవడంతో పాటు, ఆరోగ్యంగా తయారు కావడంతో డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ అపర్ణ వివరించారు. చివరకు తల్లి కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు.
అతి పిన్న వయసులో కరోనాను జయించి రికార్డు సృష్టించిన శిశువు..!
Published Mon, May 24 2021 4:17 AM | Last Updated on Mon, May 24 2021 11:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment